తూర్పుగోదావరి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆధ్వర్యంలో ‘జనసేన’ కవాతు నిర్వహించనుంది. గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పై జరగనున్న ఈ కవాతులో రెండు లక్షల మంది జన సైనికులు పాల్గొంటారని తెలుస్తోంది.
సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు పిచ్చుకలంక నుంచి ప్రారంభమై ధవళేశ్వరం వరకు ఈ కవాతు కొనసాగనుంది. మొత్తం పదమూడు జిల్లాలకు చెందిన జనసైనికులు తరలిరానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు.
పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు విజ్జేశ్వరం వద్ద, ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చే వాహనాలకు ధవళేశ్వరం, వేమగిరి వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
‘జనసేన’ కవాతు కోసం సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రత్యేక గీతాన్ని రచించినట్లు తెలుస్తోంది. కవాతులో భాగంగా కులవృత్తుల వారితో కళారూపాల ప్రదర్శన కూడా ఉంటుంది. అలాగే ఈ కవాతు కార్యక్రమాన్ని రెండు వేల మంది కార్యకర్తలు పర్యవేక్షించనున్నారు.