అహ్మదాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇంటర్ జోన్ ఛాలెంజ్ మ్యాచ్లోగుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 35-23 స్కోరుతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ జట్టులో ప్రపంజన్ 9 పాయింట్లుతో రాణించాడు.
ప్రపంజన్ అద్భుతమైన ప్రదర్శన..
ప్రపంజన్ అద్ఫుతమైన ఆటను ప్రదర్శించడడంతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 6-5 స్కోరుతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మణిందర్ మరోసారి రైడ్ పాయింట్ తేవడంతో 9-8 స్కోరుతో బెంగాల్ ఆధిక్యంలోకి వెళ్లింది. 14వ నిమిషంలో ప్రత్యర్థి జట్టుని ఆలౌట్ చేసిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 14-11 స్కోరుతో ఆధిక్యంలో నిలిచింది.
తొలి అర్ధభాగం ముగిసేసరికి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 19-14 స్కోరుతో నిలిచింది. అయితే మ్యాచ్ మొత్తంలో బెంగాల్ వారియర్స్ జట్టు బాగా ఆడింది తొలి పది నిమిషాలు మాత్రమే.
రెండో అర్ధభాగంలో… గుజరాత్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ సునాయాస విజయం సాధించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తరఫున ప్రపంజన్ 9 పాయింట్లు, అజయ్ 6 పాయింట్లు సాధించారు. ప్రపంజన్‌తో పాటు ట్యాకిలింగ్‌లో పర్వేశ్ 4 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున మణిందర్ 6 పాయింట్లు, జాంగ్ కున్ లీ 5 పాయింట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో… జైపూర్ పింక్ పాంథర్స్ విజయం
ప్రో కబడ్డీ లీగ్‌లో మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 45-28 స్కోరుతో యూపీ యోధాపై విజయం సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో దీపక్ హుడా 10 రైడింగ్ పాయింట్లు, సునీల్ 5 ట్యాకిల్ పాయింట్లతో తమ సత్తా చాటారు. వరుసగా రెండు ఓటములతో తర్వాత జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఇదే తొలి విజయం కాగా, యూపీ యోధా జట్టుకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం.
ప్రో కబడ్డీలో శనివారం జరిగే మ్యాచ్‌లు…
పుణేరి పల్టన్ Vs బెంగాల్ వారియర్స్
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ Vs బెంగళూరు బుల్స్