హైదరాబాద్: నందమూరి కుటుంబం నుండి మూడోతరం రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అధిష్ఠానం ఆదేశం మేరకే నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు..
‘‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా షూటింగ్‌లో నేను బిజీగా ఉన్నప్పటికీ వీలు చేసుకుని ప్రచారనికి వచ్చాను.. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను..’’ అని నందమూరి బాలకృష్ణ చెప్పారు. శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌తో మాట్లాడతా..
‘‘నటులు నందమూరి కల్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు వాళ్ల వాళ్ల సినిమా షెడ్యూల్స్‌లో బిజీగా ఉన్నారు. నందమూరి సుహాసిని తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వారిద్దరిని నేను ఇంకా సంప్రదించలేదు.. త్వరలోనే ఇద్దరితో మాట్లాడతా.. వీలు చూసుకుని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఇద్దరూ సుహాసిని తరఫున ప్రచారంలో పాల్గొంటారు..’’ అంటూ బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
6 నుంచి ముమ్మర ప్రచారం…
మరోవైపు మహాకూటమి నేతల తరఫున తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నవంబర్ 26 నుంచి తెలంగాణలో రోడ్ షోలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు.
నందమూరి సుహాసిని గెలుపే దివంగత హరికృష్ణకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆమె విజయానికి యువత, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కలసి రావాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు.