తీన్మార్ మల్లన్న అరెస్ట్ – ప్రజాస్వామ్యంలో నేతిబీరకాయంత?

- Advertisement -

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్న తెలంగాణలో ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ అరెస్ట్‌ అంశం గత నాలుగు రోజులుగా హాట్‌ టాఫిక్‌గా మారింది.కేసీఆర్‌ సర్కార్‌ అతనిపై పగ సాధిస్తోందని, ప్రశ్నించే గొంతుకపై దాడి చేస్తోందని కోడై కూస్తోంది.

తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేసి జైలులో పెట్టడాన్ని ప్రతిపక్షాలతో పాటు ప్రజాస్వామ్య వాదులు, జర్నలిస్టులు, మేథావులు ఖండిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్కార్ కంట్లో నలుసుగా…

ఓ ఛానల్‌ లో తీన్మార్‌ ప్రోగ్రామ్‌ తో వెలుగులోకి వచ్చిన మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ప్రభుత్వానికి ఎందుకంత కోసం అనేది కూడా చూడాలి. గత కొన్నేళ్లుగా అతను గులాబీ సర్కార్‌కు కంట్లో నలుసుగా మారారు.

ప్రశ్నించడమే తన తత్వం అంటూ క్యూన్యూస్‌ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను, దమననీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. అలాగే ప్రజా ప్రతినిధుల అక్రమాలను, కబ్జాలను, దౌర్జన్యాలను వెలికితీస్తూ ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనూ యువతలో తీన్మార్‌ మల్లన్న ఓ యంగ్‌ టర్క్‌ గా మారారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. గులాబీ అభ్యర్థి ఆ ఎన్నికల్లో డబ్బును ప్రవాహంలా ప్రవహించినా, ఆలోచనాపరులైన యువ పట్టబద్రులు తీన్మార్‌ మల్లన్న వెంటే నిలిచారు.

మల్లన్న, కోదండరాం మధ్య చోట్ల చీలికతో గులాబీ అభ్యర్థి గట్టెక్కాడు. ఇక అప్పటి నుంచి సర్కార్‌ వీలుచిక్కినప్పుడల్లా మల్లన్నను ఇబ్బంది పెడుతోందన్నది నిష్టుర సత్యం. తీన్మార్‌ మల్లన్న కూడా తన గొంతుకను మరింతగా పెంచారు.ఇదే క్రమంలో అతనిపై దాడులు, అరెస్టులు నిత్యకృత్యం అయ్యాయి. గతంలో మల్లన్న అరెస్టయినప్పుడు కూడా విపక్షాలతో పాటు మేధావులందరూ అతని పక్షాన నిలిచారు.

ఇందేం ప్రజాస్వామ్యం..

ఇక ప్రస్తుత ఎపిసోడ్‌కు వస్తే లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయంపై క్యూన్యూస్‌లో తీన్మార్‌ మల్లన్న ఓరేంజ్‌ లో ఏకిపారేస్తున్నారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీర్‌ను కూడా అరుసుకుంటున్నారు.

దీంతో బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రోద్బలంతో కొందరు క్యూ న్యూస్‌ ఆఫీస్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా ఒకరిని క్యూ న్యూస్‌ సిబ్బంది పట్టుకుని దాడిచేశారు. దాడికి సబంధించి మల్లన్న మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనికి భిన్నంగా దాడి చేసిన ఓ వ్యక్తే తనపై హత్యాయత్నం జరిగిందని ఇచ్చిన కంఫ్లైంట్‌తో పోలీసులు తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్‌ చేయడం ఏంటి అన్నదే అందరి అభ్యంతరం.

చేటు తెచ్చిన నోరు…

మల్లన్న అరెస్ట్‌ను కొంత మంది ఖండిస్తుండగా, మరికొంతమంది సమర్థిస్తున్నారు. జర్నలిస్టును అని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని పేర్కొంటన్నారు. తన వాక్‌చాతుర్యంతో లక్షల మంది సబ్‌స్క్రైబర్‌ను సంపాదించుకున్న తీన్మార్‌ మల్లన్న క్యూ న్యూస్‌ ద్వారా నిత్యం కేసీఆర్‌ కందాన్‌ వార్తలు ప్రసారం చేస్తున్నారు.

అయితే జర్నలిస్టును అని, ఏది పడితే అది మాట్లాడడం మల్లన్నకు అలవాటుగా మారిపోయిందన్న అభిప్రాయం ఉంది.బొడ్డమ్మ, తైతక్క, సారా దందా, సారా రాణి, డ్రామారావు, పోశెట్టి ఇలా పదాలు వాడడాన్ని కొందరు ఆక్షేపిస్తున్నారు.

ఇదేం జర్నలిజమని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తీన్మార్‌ మల్లన్న ఎత్తిచూపడాన్ని ఎవరూ కాదనడం లేకున్నా, అతను వాడుతున్న బాషపైనే కొందరు అభ్యంతరం పెడుతున్నారు.

నయా ప్రజాస్వామ్యం..

తీన్మార్‌ మల్లన్న మాటలు సర్కార్‌లోని ముఖ్యనేతలకు ఆగ్రహాన్ని తెప్పించాయని, అందులో భాగంగా పోలీసులను ప్రయోగించారని తెలుస్తోంది. మొత్తంగా మల్లన్న తీరులో కొంత తప్పున్నా ఇంతలా వేధించాల్సిన అవసరం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కవిత మాటలో చెప్పాలంటే మహా అయితే ఏమైతది.. ఓ వారం, నెలరోజులు జైలులో ఉంటామెమో… అంతేగానీ చంపరుగా..? ఇదే మల్లన్న కూడా చెబుతారు. గతంలో విమర్శలను సద్విమర్శలుగా తీసుకునే వారు. ఇపు మాత్రం సీన్‌ మారింది. ఎటొచ్చి నయా ప్రజాస్వామ్యం తీరే మారుతోంది.

- Advertisement -