టెక్సాస్: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగ విప్పింది. తుపాకీ కాల్పులతో టెక్సాస్ ఉలిక్కిపడింది. ఓడెస్సాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని వెంబడించి సినర్జీ సినిమా థియేటర్ వద్ద కాల్చి చంపారు.
ట్రక్కును హైజాక్ చేసి…
అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఉరుకులు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను ఒడెస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ముందుగా బైక్‌పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.
అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక ట్రక్కును హైజాక్ చేసి అందులో నుంచే జనాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.