21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగా‌ణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్.. నరసింహన్‌కు నో పోస్టింగ్

తెలంగా‌ణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్.. నరసింహన్‌కు నో పోస్టింగ్

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గవర్నర్‌గా కొనసాగుతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను కేంద్రం ఎట్టకేలకు ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దత్తాత్రేయను గవర్నర్‌గా…

ప్రస్తుత గవర్నర్ నరసింహన్‌ను పదవి నుంచి తప్పించడమే కాదు, ఆయన్ని ఏ రాష్ట్రానికి కేటాయించకుండా పక్కన బెట్టింది. అలాగే తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను కేంద్రం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌గా నియమించింది.

ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేసింది. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును తప్పించి, భగత్ సింగ్ కోశ్యారిని గవర్నర్‌గా నియమించింది. దీంతో పాటు కేరళకు ఆరిఫ్ అహ్మద్ ఖాన్‌ను గవర్నర్‌గా ప్రకటించింది.

తమిళి సై గురించి క్లుప్తంగా…

తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌. ఆమె ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో 1961 జూన్ 2న జన్మించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. కొంతకాలం వైద్య వ‌ృత్తిలో కొనసాగారు. 

తమిళి సై భర్త సౌందర్‌రాజన్ కూడ తమిళనాడులో వైద్యవృత్తిలోనే కొనసాగుతున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గతంలో ఆమె బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పని చేశారు.

2006, 2011 సంవత్సరాలలో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక 2009, 2019 సంవత్సరాలలో బీజేపీ తరుపున లోక్‌సభ‌కు పోటీ చేసినా విజయం ఆమెను వరించలేదు. 

- Advertisement -