
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం రాజధాని రైతులతో సమావేశమైన పవన్ వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.
రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని, రాజధానిని తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లక్ష్యంగా పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు.
బొత్సకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ మనసులో ఏ మూలనో ఉందని, ఈ ప్రభుత్వంలోనే ఆయన ముఖ్యమంత్రి కావచ్చేమోనని ఎద్దేవా చేశారు. తమ భవిష్యత్తు తరాలకోసం వేలాది మంది రైతులు తమ భూములు ఇచ్చారనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదన్నారు.
‘‘రాజకీయం స్కూలు పిల్లల ఆట కాదు..’’
కులాలపై కక్షను ప్రజలందరి మీదా రుద్దడం మంచిది కాదని పవన్ హితవు పలికారు. రాజకీయం చేయడమంటే స్కూలు పిల్లల ఆట కాదన్నారు. ఇప్పటికే పోలవరం టెండర్లు రద్దు చేసి చెడ్డపేరు మూటగట్టుకున్నారని, రాజధాని నిర్మాణం.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎంతో మంది ఉత్తరాది కూలీలు పనిచేస్తున్నారని అన్నారు. వారి జీవితాలను గండికొట్టొద్దన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ విధానాలనే వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం సరికాదని, ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో భవన నిర్మాణ కార్మికులు వలసలు వెళుతున్నారని విమర్శించారు. 150 మందికి పైగా ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టిన వైసీపీ ఆలోచించి అడుగులు వేయాలని పవన్ సూచించారు.
‘‘అది మోడీ, అమిత్ షాలను వ్యతిరేకించడమే..’’
రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని గుర్తు చేసిన పవన్.. ఒకవేళ రాజధానిని వ్యతిరేకిస్తే మోడీని వ్యతిరేకించినట్టేనని, అమిత్ షాను వ్యతిరేకించినట్టేనని అన్నారు. ఈ విషయాన్ని బొత్స గుర్తించాలన్నారు.
రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు తాను అండగా ఉంటానని, వారి తరపున తాను పోరాడతానని పవన్ అభయమిచ్చారు.








