అమెరికాలో మరో ఘోరం.. హైదరాబాదీ మహిళ అనుమానాస్పద మృతి

hyderabadi-woman-suspecious-death-in-north-carolina
- Advertisement -

నార్త్ కరోలినా: హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. నార్త్ కరోలినాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నాగోల్‌లోని సాయినగర్‌కు చెందిన గజం వనిత(38)కి 2006లో రాచకొండ శివకుమార్‌తో వివాహమైంది.

వనితకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె తన భర్త, పిల్లలతో కలిసి అమెరికాలోని నార్త్ కరోలినా ప్రాంతంలో ఉంటోంది. అయితే శివకుమార్ తన భార్య వనితను మానసికంగా వేధించేవాడు. దీనికి అతడి తల్లిదండ్రులు కూడా వంత పాడేవారు.

దీంతో భర్త, అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక తన పిల్లలను తీసుకుని రెండేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చిన వనిత హైదరాబాద్‌లోని తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఏడాది క్రితం అత్తవారింటికి వచ్చిన శివకుమార్ ఇకమీదట బాగా చూసుకుంటానని వారికి నచ్చజెప్పి తిరిగి భార్య, పిల్లలను అమెరికా తీసుకెళ్లాడు. 

గత జులై నెలలో భర్త శివకుమార్‌తో కలిసి అమెరికా వెళ్లిన వనిత దగ్గర్నించి గత రెండు నెలలుగా ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు.  ఈ నేపథ్యంలో ఆదివారం నార్త్ కరోలినా పోలీసుల నుంచి వనిత తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. 

వారి కుమార్తె వనిత అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు వారు హైదరాబాద్‌ సాయినగర్‌లో ఉంటోన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారు ఘొల్లుమన్నారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని.. భర్తతోపాటు అత్తమామలే ఆమెను చంపేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. 

మరోవైపు వనిత మృతి ఘటనలో ఆమె భర్త  రాచకొండ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న నార్త్ కరోలినా పోలీసులు ఆమె మృతికి గల కారణాలపై విచారిస్తున్నట్లు సమాచారం. 

- Advertisement -