ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందికానీ.. సాధించినదేమిటి? ఒక ఆత్మావలోకనం…

1:53 pm, Sun, 2 June 19
telangana-map-cm-kcr
నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశయాలతో,
శ్రీకాంతాచారిలాంటి ఎంతోమంది యువకుల ఆత్మార్పణాలతో వచ్చిందీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం..
ఇది ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు..
ఉద్యమాలే ఊపిరిగా.. భార్యాపిల్లలు, ఇల్లూవాకిలీ అన్నీ వదిలి, తిండీతిప్పలు లేకుండా మండుటెండలో రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, సకల జనుల సమ్మెలంటూ తిరిగి.. పోలీసుల లాఠీ దెబ్బలు తిని.. కిక్కిరిసిన పోలీసు వాహనాల్లో వెళ్లి.. చాలీచాలని జైళ్లలో.. తెలంగాణలోని అన్నిపార్టీలకు చెందిన ఎంతోమంది నాయకులు, ప్రజలు, విద్యార్థులు నలిగి.. నలిగిపోతే.. వచ్చిందీ  తెలంగాణ రాష్ట్రం..
ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. నాడు కేసీఆర్ చెప్పినదేమిటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. ఈ ఐదేళ్ల పాలనలో సాధించినదేమిటి? అని ఆత్మావలోకనం చేసుకునే నేపథ్యంలో ‘న్యూస్ ఎక్స్ ప్రెస్’ అందిస్తోన్న ప్రత్యేక కథనం..

ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెబుతూ పండితులు..

రాజపూజ్యం 3, అవమానం 12, ఆదాయం 5, ఖర్చు 14 ఇలా చెబుతుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అచ్చు అలాగే ఉంది. ఈ ఉగాది లెక్కల్లో చూస్తే.. రాజపూజ్యం మూడు అంటే గౌరవం అన్నమాట..

ఇది చెప్పాల్సి వస్తే..

ముందుగా రైతులకిచ్చిన రైతుబంధు పథకం గురించి చెప్పాలి.. అంతవరకు పంట వేసేందుకు పెట్టుబడి లేని రైతుకు సరాసరి తన బ్యాంకు ఖాతాలో ఎకరానికి 8వేల రూపాయలు వచ్చి పడ్డాయి. పది ఎకరాలున్నవాళ్లకి రెండు వాయిదాల్లో నలభైవేల చొప్పున వేయడంతో..రైతులు ఆనందించారు. పంటలు వేసేందుకు ముందుకొచ్చారు. 

రెండవది.. ముఖ్యమైనది 50 ఏళ్లుగా చుక్కనీరు కూడా చూడని మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామాల్లో చెరువులకు నీళ్లు వచ్చి చేరాయి. మూడోది కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పెన్షను పెంపులాంటి వాటిలో ఉన్నాయి..

కాలేశ్వరం ప్రాజెక్టు కూడా చెప్పుకోవాలి..

ఆంధ్రాలో పోలవరం ప్రాెజెక్టు తరహాలోనే ఇదీ సాగుతోంది. ఇది నిజంగా భగీరథ ప్రయత్నమే..అందుకు అభినందించాలి. అయితే  ఇక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే మాత్రం.. నీళ్లు రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రతీది లిఫ్ట్ మీదే లాగాలి. మూడుచోట్ల ఆనకట్టలు.. మూడు చోట్ల లిఫ్ట్ పైనే నీళ్లు తోడాలి.. ప్రవాహ వేగం ఉంటే నీళ్లు ఉరికి ఉరికి వెళతాయి.

ఎప్పుడో ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి గోదావరికి వరద వస్తుంది. అదీ వారం రోజులు మాత్రమే ఉంటుంది. అప్పుడు గబగబా తోడాలి. ఆ పైనున్న మహరాష్ట్ర వాడు ఇవ్వాలి. 

ఇప్పటికే గ్రామాల్లో లోవోల్టేజీ కరెంటుతో.. ఇళ్లలో వేసుకున్న బోర్ల నుంచే తాగడానికి నీళ్లు రావడం లేదు. మరింత పెద్ద ప్రాజెక్టుకి ఎంత కరెంటు కావాలి? అదెక్కడ నుంచి కేసీఆర్ తెస్తాడన్నది ప్రధాన సమస్య. కోట్ల రూపాయలు ఖర్చయిపోతున్నాయిి. నల్గొండ జిల్లా పీఏ పల్లి దగ్గర ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి హైదరబాద్ తరలించడానికి తడిసి మోపెడవుతోంది.

అయితే నిజంగా నీళ్లు వస్తే తెలంగాణ ప్రజలు అదృష్టవంతులే..కాకపోతే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రమంతా నేలవరకు ఒక పదేళ్లలో  తడిసి.. అడవులు పెరిగి.. అప్పుడు ఆకాశంలో మేఘం నిలబడి..వర్షాలు కురిస్తే మాత్రం..అది కేసీఆర్ ఘనతగానే చెప్పాలి.

అయితే ఇప్పుడు గౌరవం తర్వాత అవమానాలు చెప్పుకోవాలి.

మనలో మన మాటగా చెప్పాలంటే వాటికన్నా ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గౌరవం 3 ఉంటే..అవమానం 14గా కనిపిస్తోంది..ఇందులో మొదటిది విద్యా వ్యవస్థ.. అది కుప్పకూలిపోయింది. రేపు భవిష్యత్తులో తెలంగాణ నుంచి చదువుకునే విద్యార్థులు..ఉన్నత చదువులు చదివే అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

‘‘మీ పిల్లవాడి ఫీజులు నేనే కడతాను..’’

అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నీటి మూటలే అయ్యాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. పునాది గట్టిగా ఉంటేనే భవనం నిలుస్తుంది.  పల్లెల్లో, పట్టణాల్లో ప్రాథమిక, ప్రాధమికోన్నత విద్యా వ్యవస్థ పట్టిష్టంగా ఉంటేనే.. విద్యార్థులకు ఉన్నత విద్య సులువు అవుతుంది.

గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేక తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి. సబ్జక్టు టీచర్లు లేక విద్యార్థులు అరాకొరా చదువులతో బయటకువస్తున్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదు. మరోవైపు బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థుల ఆశలు అడియాశలైపోతున్నాయి.

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో…

అయితే ఏడాదికేడాది చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇది ఒక ప్రమాద సంకేతంగా పరిగణించాలని మేధావులు చెబుతున్నారు.. పేదవాడు చదువుకునే అవకాశాలు..ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల మృగ్యమైపోతున్నాయనే విమర్శలు అధికమవుతున్నాయి.

విద్యావ్యవస్థ..మొద్దు బారిపోయి ఉందనడానికి తాజా ఉదాహరణ..ఇంటర్మీడియట్ విద్యార్థులు 24మంది మరణించడమే..దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే కాదు.. ఎవరూ జవాబుదారీతనం వహించ లేదు.

పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం..ఇంకా శోకిస్తూ న్యాయం చేయాలంటూ తిరగడం..ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్టగా చెప్పాలి.

లక్ష ఉద్యోగాలిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటూ..

నిరుద్యోగులకి మాయ మాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇప్పటికీ ఆ ఊసు ఎత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ఒకవైపు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలిరోజే 4లక్షల ఉద్యోగాలిస్తానని ప్రకటించడం చూసి..మన కేసీఆర్ సిగ్గుపడాలి.. అని తెలంణాలో అప్పుడే సెటైర్లు పేలుతున్నాయి.

మొదటిసారి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని మాటిచ్చిన కేసీఆర్..

రెండోసారి ఎన్నికల్లో అవిగో అక్కడ పూర్తవుతున్నాయి..ఇల్లు అంటే మాటలా.. వెంటనే పూర్తయిపోద్దా..లక్షల ఇళ్లు కట్టాలి..అని చెప్పి ఓట్లేయించుకున్నాడు. ఈ అవతరణ రోజునైనా వాటిని చూపించాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు.

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని మాటిచ్చిన ముఖ్యమంత్రి

ఆ మాటే మరిచిపోయారని వారూ ఆక్రోశిస్తున్నారు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, మండలానికి 30 పడకల ఆసుపత్రి, జిల్లాకొక మెడికల్ కాలేజ్, గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా ఎన్నో లెక్కలేనన్నీ హామీలన్నీ.. ఉత్తుత్తి హామీలుగా గాలిలోనే కలిసిపోయాయి. 

ఈసారైనా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త హామీలు కాకుండా.. ముందు ఇచ్చినవి నెరవేర్చేందుకు ఏం చేస్తున్నాడో చెబితే బాగుంటుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ హామీలన్నింటినీ  అవమానాలుగానే భావించవచ్చు..

ఇక ఆదాయం విషయానికి వస్తే..

విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే..రాజధాని హైదరాబాద్ తో పాటు.. మిగులు నిధులతో సహా అన్నీ పంచభక్ష పరమాన్నాలతో చేతిలో పెడితే..తిరిగి ఈరోజున రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైనంపై ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా జీతాలివ్వడానికి డబ్బుల్లేని దుస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఏమి వచ్చిందని  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

ఆరేళ్ల క్రితం హైదరాబాద్ సిటీ ఎలా ఉందో..

ఇప్పుడూ అలాగే ఉంది.. కొత్త ప్రభుత్వం వచ్చినందుకు కొత్త సంస్కరణలేవీ కనిపించడం లేదు. ఎవరో ప్రారంభించిన మెట్రో వీరి హయాంలో పూర్తయింది అంతే… ఇక గట్టిగా వాన పడిందంటే..మోకాల్లోతు నీళ్లే.. వీటికి పరిష్కారం ఇప్పటివరకు కనుక్కోలేదు. రోడ్లు కూడా ఎక్కడ చూసినా గతుకుల మయం.

మ్యాన్ హోళ్లు ఎక్కడ ఏది నోరుతెరుచుకుంటూ ఎదురుచూస్తుందో తెలియని దుస్థితి… ఇంకా సిటీలో పరిష్కారమే లేనట్టు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు.. వాటిపై నియంత్రణ లేదు.. ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యలు.. పరిష్కారమార్గాలను చూద్దామనే ఊసే లేదు.. ఇక భారీ వాహనాలు సిటీలోకి రాకుండా ఊరి చివర కడతానన్న లార్జిస్టిక్ పార్క్ సంగతే మరిచిపోయారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన నగరాలేవీ..

కొత్త సొబగులు అద్దుకోలేదు. ఏదో ఒకట్రెండు ప్రజా సంక్షేమ పథకాలతో కాలక్షేపం చేసి పబ్బంగడుపుకోవడం మాని.. రాష్ట్ర అభివృద్ధికి ఆలోచన  చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి అధికంగా వినిపిస్తున్నాయి.

ఈ తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగానైనా.. ప్రత్యేక రాష్ట్రం కోసం అశువులు బాసిన 1200 మంది అమరవీరులకు స్మ్రతి చిహ్నంగా కడతానన్న స్థూపంపై ఒక నిర్దిష్ట ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.  ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి.

మన తెలంగాణ రాష్ట్రం వస్తే..మనకి అన్నీ మంచిరోజులే అని చెప్పిన కేసీఆర్..ఏం మంచి చేశాడని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే.. గుండెల నిండా దుఖం, కంటి నిండా కన్నీరు తప్ప.. తెలంగాణ ప్రజలకు మిగిలిందేమీ కనిపించడం లేదు.

– శ్రీనివాస్ మిర్తిపాటి