26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ నజరానా: రైతులకు అదనంగా రూ.లక్ష రుణ మాఫీ…

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ నజరానా: రైతులకు అదనంగా రూ.లక్ష రుణ మాఫీ…

telangana-cm-kcr
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ రైతులకు నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మరో లక్ష రుణం అదనంగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ మహోద్యమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైందని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక ఈ ఐదేళ్లలో ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రగతి పథంలో దూసుకుపోతున్నామని, దీనికి సాక్ష్యం 16.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయడమేనన్నారు.

‘రైతుబంధు’ గొప్ప పథకం…

ఇక రైతుల సంక్షేమం కోసం రాష్ట్రం అమలు చేసిన ‘రైతుబంధు’ పథకం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, ఇదో గొప్ప పథకమని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని చెప్పారు. అటు కేంద్రం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా మన రైతు బంధు పథకమే ప్రేరణ అని తెలిపారు.

రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఈ పథకానికి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన గుర్తు చేశారు.

రాజకీయ అవినీతికి దూరంగా…

రాజకీయ అవినీతికి దూరంగా ఉన్న బలమైన రాష్ట్రం మనదని, 24 గంటలు విద్యుత్‌ ఇచ్చిన ఘనత కూడా మన సొంతమేనని సీఎం చెప్పారు. అంతేకాదు, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ కోసం.. బతుకమ్మ చీరల తయారీ బాధ్యతను వారికే అప్పగించి కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత కూడా మనదేనన్నారు.

విద్యా ప్రమాణాలు కూడా పెరిగాయని, పింఛన్ల పంపిణీలో దళారుల ప్రమేయం లేకుండా చూడడం వల్ల ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా ప్రజా వైద్యంపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా చేయగలిగామని చెప్పారు.

‘కంటి వెలుగు’ మరో వరం…

‘కంటి వెలుగు’ పథకం తెలంగాణ ప్రజలపాలిట మరో వరమని, దీని స్ఫూర్తితో ఈఎన్‌టీ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్‌, రంజాన్‌లను రాష్ట్ర వేడుకలుగా గుర్తించామని కేసీఆర్ చెప్పారు. అవినీతిని పారదోలితే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, పాలనలో జవాబుదారీ తనం కోసం పురపాలక చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు.

ఆత్మగౌరవ భవనాలు…

ఆయా కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చామని, గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

‘మిషన్‌ కాకతీయ’ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన పథకమని, అలాగే తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకున్నామని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరందించడంలో సఫలమయ్యామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆ వృత్తి వారికీ జీవోనోపాధి కలిగేలా చూస్తామని చెప్పారు.

- Advertisement -