వరంగల్: పోలీసులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులను కించపర్చేలా మాట్లాడితే సహించేది లేదని ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల ఆశోక్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు పోలీసులను కించపర్చేలా మాట్లాడుతున్నారని, తమ ఇష్టానుసారంగా దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు పోలీసు సిబ్బంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
సంగెం ఎన్నికల ప్రచారంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ పోలీసులపై అనుచిత వాఖ్యలు చేస్తూ విరుచుకుపడడం, దుర్భాషలాడడం తెలంగాణలో పోలీసులను కించపరిచే విధంగా ఉందని ఆశోక్ కుమార్ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ కుటుంబాలను విడిచి ప్రజల కోసం పని చేస్తున్న పోలీసులపై విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.
అంతేకాదు, కొండా సురేఖ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరికీ అలుసైపోయిందని, ఉన్నతాధికారులు ఒక్కసారి అనుమతిస్తే.. అక్రమార్కులను ఏరిపారేస్తామంటూ ఆయన హెచ్చరించారు.