

యాదాద్రి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవ్వడానికి అతికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అయా పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే అర్థరాత్రి సమయంలో నేతలు వాహనాలలో డబ్బులు తరలిస్తున్నారు. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం యాదాద్రి జిల్లా ఆలేరు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం ఉదయం 5 గంటల సమయంలో రూ.13.3 లక్షలు పట్టుకుని, స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న టాటా ఏస్ వాహనంలో పోలీసులు తనిఖీలు జరపగా.. భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఆ వాహనంలో కప్పు సాసర్లతో కూడిన అట్టపెట్టలు ఉన్నాయి.
పోలీసులు వాటన్నింటినీ పరిశీలించగా.. వాటిల్లోని ఒక పెట్టెలో నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకొని వాహనం డ్రైవర్‌ని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి తొర్రూరుకి ఈ నగదు పంపిణీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.








