రేవంత్ రెడ్డి అరెస్ట్ ఇష్యూ: వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు.. కొత్త ఎస్పీగా అవినాశ్‌ మహంతి

Vikarabad SP Annapurna Transfer By EC For Revanth Reddy Arrest Case
- Advertisement -

Vikarabad SP Annapurna Transfer By EC For Revanth Reddy Arrest Case

వికారాబాద్‌: వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ డీజీపీని ఆదేశించింది. దీంతో  వెంటనే ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్‌ జాతీయ నాయకులు కపిల్‌ సిబాల్‌ తదితరులు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో హైకోర్టు కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరై సమాధానం చెప్పాలని ఆదేశించగా, ఆ మేరకు డీజీపీ హైకోర్టుకు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి అరెస్టు వ్యవహారంలో వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణ అత్యుత్సాహం ప్రదర్శించారని, అవసరం లేకున్నా ఆయనను అరెస్టు చేసినందుకు ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆమెకు ఎలాంటి విధులను  అప్పగించరాదని కూడా  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

వికారాబాద్‌ కొత్త ఎస్పీగా అవినాశ్‌ మహంతి…

వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడడంతో ఆ జిల్లా కొత్త ఎస్పీగా అవినాశ్‌ మహంతిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అన్నపూర్ణ స్థానంలో అవినాశ్‌ మహంతిని డీజీపీ నియమించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అయన తెలియజేశారు.

- Advertisement -