27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కేసీఆర్‌పై ద్వేషం లేదు, ఆ కసితోనే పోటీ: వంటేరు ప్రతాప్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో గులాబీ...

కేసీఆర్‌పై ద్వేషం లేదు, ఆ కసితోనే పోటీ: వంటేరు ప్రతాప్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి

vanteru pratap reddy
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తనకు వ్యక్తిగత ద్వేషమంటూ ఏమీలేదని.. ఎన్నికల్లో గెలవాలని మాత్రమే పోరాటం చేశానని సీనియర్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే టీఆర్ఎస్ పార్టీకి గత రెండు ఎన్నికల్లో భారీగా ఓట్లు పడ్డాయని వంటేరు ప్రతాప్‌ రెడ్డి అన్నారు.

శుక్రవారం సాయంత్రం వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ తనను రెండుసార్లు తెరాసలోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. ఈసారి మాత్రం గట్టిగా అడిగేసరికి ఆ మాటకు కట్టుబడి తాను ఈరోజు టీఆర్ఎస్‌లో చేరినట్టు చెప్పారు.

కేసీఆర్ చేపట్టిన పథకాలే గెలిపించాయి..

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ సీఎంగా చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరాయని వంటేరు చెప్పారు. రైతు బీమా, రైతు బంధు, పింఛను, వాటర్‌ గ్రిడ్, యాదవులకు గొర్రెలు, రైతులకు బర్రెల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలన్నీ పేదలకు చేరాయన్నారు. కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలకే ఓట్లు వచ్చాయని చెప్పారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టు రైతుల పక్షాన నిలబడి తాను అనేక లాఠీ దెబ్బలు తిన్నానన్నారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారని, అందువల్ల ఆయన నిర్ణయాలే కరెక్టు అని తాను గ్రహించినట్టు చెప్పారు. అందుకే సీఎం నిర్ణయానికి కట్టుబడి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు వంటేరు స్పష్టంచేశారు. కేసీఆర్‌ హయాంలో గజ్వేల్‌ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.

ఆ కసితోనే సీఎంపైనా పోటీ చేశా..

తాను ఎమ్మెల్యేగా పనిచేయాలనే కసితోనే గజ్వేల్‌లో పోటీచేశానని వంటేరు అన్నారు. సీఎం బరిలో ఉన్నారు ఇంకా తానెక్కడ గెలుస్తానని అనుకోకుండా ఎమ్మెల్యే కావాలన్న తాపత్రాయంతోనే గజ్వేల్‌లో అధికార పార్టీతో కొట్లాడినట్టు చెప్పారు. అంతేతప్ప తనకు కేసీఆర్‌ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. అంతేగాక, ఇదివరకే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉంటే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు.

తనను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు వంటేరు. తనకు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని, పార్టీకి, కేసీఆర్‌, కేటీఆర్‌లకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని వంటేరు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు లేదని అన్నారు.

- Advertisement -