

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతగా ఆ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ మల్లు భట్టి విక్రమార్క నియమితులయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
సామాజిక సమీకరణాల కోణంలోనూ దళిత వర్గాలకు చెందిన భట్టిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే బాగుంటుందనే ఆలోచనతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌కు గత శాసనసభలో 21 మంది శాసనసభ్యులుండగా ప్రస్తుతం 19 మంది సభ్యులే ఉన్నారు. సీఎల్పీ పదవికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
రాహుల్ గాంధీ ఎంపిక…
గురువారం జరిగిన సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ అధిష్ఠానం మల్లు భట్టివిక్రమార్కను ఆ పదవిలో నియమిస్తున్నట్లు ప్రకటించింది.
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆసక్తి వ్యక్తపరిచారు. అయితే సభలో అధికార పార్టీని ఢీకొనేందుకు వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఉన్న నేత అవసరమని భావించిన అధిష్ఠానం చివరకు భట్టికే ఓటేసింది.
పార్టీలో సీనియర్ నేత కావడం, మూడుసార్లు వరుసగా గెలుపొందడం, సామాజిక సమీకరణాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆరుగురు విజయం సాధించడం కూడా ఆయన ఎంపికకు కలిసొచ్చాయి. కాగా, సీఎల్పీ బాధ్యతలు భట్టికి అప్పగించడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే లోక్‌సభ ఎన్నికలను పార్టీ ఎదుర్కోనుందని తెలుస్తోంది.
మల్లు కుటుంబానిది రాజకీయ నేపథ్యమే…
భట్టి విక్రమార్క 1961లో జన్మించారు. విక్రమార్కది రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు అనంతరాములు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖమ్మం జిల్లాలో పనిచేసిన భట్టి.. ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా 1996–2000 నామినేటెడ్ (తొలిసారి) పదవి చేపట్టారు. 1990–92 వరకు పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, 2000–03 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు.
ఆ తర్వాత 2007–2009 వరకు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి విక్రమార్క.. 2014, 18 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు.
2009లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి కావాలని కలలుగన్న భట్టి.. ఇంటర్వూ్య వరకు వెళ్లారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.
రాజీలేని పోరాటం చేస్తా…
తనను సీఎల్పీ నేతగా నియమించడం పట్ల భట్టి విక్రమార్క.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలకు, తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో పార్టీకి పునర్‌వైభవం తెచ్చేలా పనిచేస్తానని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని భట్టి విక్రమార్క అన్నారు.








