
తెలంగాణ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులుకు అందజేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా గెలవడంతో బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత శాసనసభలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజీనామా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్‌నగర్ నియోజక వర్గాల ప్రజలు తనను ఎంతో ఆదరించారని, కుటుంబంలో ఒక డిగా చూసుకున్నారని అన్నారు. ఎంపీగా కూడా గెలిపించి తనపై అభిమానాన్ని చాటుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీగా కోదాడ, హూజూర్‌నగర్‌తోపాటు మరో 5 నియోజకవర్గాల ప్రజలకూ సేవ చేస్తానన్నారు. ఎంపీగా సేవ చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ప్రాణం ఉన్నంత కాలం రుణపడి ఉంటా. వారి సేవకే అంకితం అవుతాను అని ప్రకటించారు.
ఉత్తమ్ సమర్పించిన రాజీనామాను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆమోదించారు. వెంటనే అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు అధికారికంగా బులిటెన్ విడుదల చేశారు. జూన్ 5 నుంచే ఉత్తమ్ రాజీనామా అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తమ్ రాజీనామా నేపథ్యంలో హుజూర్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఎవరు ఉంటారనేది చర్చనీయాంశమైంది.








