
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలని నేరుగా కలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ అధికారం కోల్పోయిన…. ప్రజావేదికని తమకు కేటాయిస్తే అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకుంటామంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.
అయితే చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ కూడా మరో లేఖ రాసింది….ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం… పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోరారు.
దీనిని తమకు కేటాయిస్తే పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇక్కడ నిర్వహించే సమావేశాలకు జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారనితెలిపారు. అలాగే ఆయన భద్రతకు, ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన వివరించారు.
అయితే ప్రజావేదికను తమకంటే తమకు కేటాయించాలంటూ ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ కోరుతుండడంతో… సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ప్రజావేదిక చివరికి ఎవరికి దక్కుతుందో.








