
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం ఇలా చేసాడో లేదో , అప్పటినుండి పాలనలో తనమార్క్ చూపించడం మొదలుపెట్టాడు. తాను అనుకున్న పనులని సూటిగా సుత్తిలేకుండా చేసుకుంటూ పోతున్నాడు.
అలాగే అధికారులతో గంటల తరబడి భేటీలు నిర్వహించకుండా, డైరెక్టుగా పాయింట్ తో పాయింట్ వివరించి పంపేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీపై జగన్ తాజాగా కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో వీక్లీఆఫ్ అనేది లేకుండా దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ పై కసరత్తులు స్టార్ట్ చేసారు. ఈ విషయంలో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పోలీసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన దానిని గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో పలువురు పోలీసులు, హోంగార్డులు ఆయన్ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు.
వారి సమస్యలు తెలుసుకున్న వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీఆఫ్, హోంగార్డులకు మెరుగైన వేతనాలు, పోలీసు కుటుంబాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలోనే ఆయన సీఎం కావడం, తన హామీని అమలుచేసే దిశగా వైఎస్ జగన్ అడుగులు వేయడంతో పోలీసులు ముఖ్యమంత్రి పై హర్హం వ్యక్తంచేస్తున్నారు.








