హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సిఈఓ రవి ప్రకాశ్….సంచలన వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాతంలో ఉండి ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి ప్రకాశ్ మాట్లాడుతూ.. టీవీ9 చానల్ పై కన్నేసిన ‘మై హోం’ జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ప్రవేశించారని ఆరోపించారు.
ఇక రామేశ్వర్ రావు ఇప్పుడు టీవీ9 చానల్ లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని, అయితే తమ 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 చానల్ యథాతథంగా ఉంటుందనే ఆశిస్తున్నానని ఆయన తెలిపారు.
చదవండి రవిప్రకాశ్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఇక అరెస్టు అనివార్యం!?
అలాగే తనపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని, తానో జర్నలిస్టునని, అసాధ్యమనదగ్గ రీతిలో చానల్ ను అభివృద్ధి చేశానని అన్నారు. అయితే తాను ఇప్పటికీ టీవీ9 చానల్ లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానని, లేదంటే మరో చానల్ ప్రారంభించి, దాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
రవి ప్రకాశ్ అరెస్ట్ అయ్యే అవకాశం…
ఫోర్జరీ కేసులో రవి ప్రకాశ్‌ని టీవీ9 యాజమాన్యం విధుల నుండి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినా వాటికి స్పందించకుండా రవి అజ్ఞాతంలో ఉన్నారు.
ఈ క్రమంలోనే రవిప్రకాశ్ తెలంగాణ హైకోర్టులో పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తును కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. అలాగే ఆయన్ని వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది. ఇక పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా రవి ప్రకాశ్ స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పేలా లేదు.








