పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం: సగానికిపైగా కైవసం, ఎవరికెన్నంటే.?

trs
- Advertisement -

trs

హైదరాబాద్‌: తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమతి(టీఆర్ఎస్) ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మద్దతుదారులే భారీ సంఖ్యలో విజయాలను నమోదు చేశఆరు. సగానికి పైగా స్థానాల్లో గులాబీ జెండా ఎగిరింది.

ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మినహా మిగతా పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థులు చాలా చోట్ల తమ సత్తా చాటుకున్నారు. తొలిదశలో 3701 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరిగింది.

తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా టీఆర్ఎస్ 2629, కాంగ్రెస్‌ 920, బీజేపీ 67, టీడీపీ 31, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు. తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా.. తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

769 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీ సర్పంచి పదవులకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల్లో 85.76 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తంగా 41,56,414 ఓట్లు పోలయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా..78.47 శాతం ఓట్లు పోలయ్యాయి.

మహిళా ఓటర్లదే అగ్రస్థానం

పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవటం విశేషం. ఏకగ్రీవాలు పోను సోమవారం ఎన్నికలు జరిగిన 3,701 గ్రామాల్లో మొత్తం 48,46,443 ఓటర్లున్నారు. అందులో 23,96,965 మంది పురుష ఓటర్లు, 24,49,361 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 41,56,414 ఓట్లు పోలవ్వగా.. 20,36,782 మంది పురుషులు, 21,19,624 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్‌లో మహిళల ఓట్లు 86.54%, పురుషుల ఓట్లు 84.97% ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

మూడు చోట్ల రీపోలింగ్

మొదటి విడుతలో వివిధ కారణాలతో మూడుచోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామపంచాయతీ మూడోవార్డుకు జనవరి 30న, వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ముంజాలకుంట రెండోవార్డుకు, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమన్‌పల్లి ఎనిమిదో వార్డుకు జనవరి 25న రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -