
హైదరాబాద్: సారు..కారు…పదహారు…ఢిల్లీలో సర్కారు. ఇది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు ఎత్తుకున్న నినాదం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ….లోక్‌సభ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. ఈ క్రమంలోనే అవసరం లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు.
దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో ఒకటి మిత్రపక్షం ఎంఐఎంకి వదిలేసిన మిగతా 16 సీట్లు తమ ఖాతలోనే పడతాయని ధీమాలో ఉండిపోయారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో 16 సీట్లు గెలిస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించవచ్చు అని ప్రచారం చేశారు.
అయితే ఎన్నికల ఫలితాలకొచ్చేసరికి మొత్తం రివర్స్ అయింది. గత ఎన్నికల్లో 11 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్…ఈసారి 9 సీట్లకే పరిమితం అయ్యారు. అసలు సీఎం కేసీఆర్ తనయ కవిత నిజామాబాద్‌లో ఓడిపోవడం సంచలనం అనే చెప్పాలి.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న మోడీ వేవ్….తెలంగాణలో కూడా ఉన్నట్లు అనిపించింది. దాంతో ఎవరు ఊహించని విధంగా ఇక్కడ బీజేపీ 4 సీట్లు దక్కించుకుంది. అటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న…ఈ ఎన్నికల్లో కోలుకుంది. 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంఐఎం తన స్థానం హైదరాబాద్‌ని నిలబెట్టుకుంది.








