22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తండ్రీ.. నన్నేల విడిచితివి?: కేఏ పాల్‌ పార్టీ గల్లంతు, ఆయనకు పోలైన ఓట్లెన్నో తెలుసా?

తండ్రీ.. నన్నేల విడిచితివి?: కేఏ పాల్‌ పార్టీ గల్లంతు, ఆయనకు పోలైన ఓట్లెన్నో తెలుసా?

KA Paul defeat in ap elections
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని, తానే ఏపీకి కాబోయే సీఎం అంటూ ప్రతి మీడియా సమావేశంలోనూ ఆయన గగ్గోల్లు పెట్టేశారు.

అంతేకాదు, వినూత్న ప్రచారశైలితో ఆయన మీడియా దృష్టినీ ఆకర్షించారు. కొన్ని టీవీ చానళ్లు కూడా ఆయనతో ఫోన్ ఇంటర్వ్యూలు చేశాయి. ప్రజలు తన పార్టీని గెలిపించి, తనకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడితే.. తాను లక్షల కోట్ల రూపాయల విరాళాలు తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తానని కేఏ పాల్‌ చెప్పడం అందరికీ విడ్డూరమనిపించింది.

ఎన్నికల ముందు ఆయన పలు టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని చెప్పడమేకాక అధికారంలోకి వచ్చేేది తమ పార్టీయేనంటూ ధీమా వ్యక్తం చేసేవారు. 

ఈ నేపథ్యంలో ఏపీలో పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్ధులని బరిలోకి దించిన పాల్.. నర్సాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో స్వయంగా పోటీ చేశారు. అయితే మే 23న వెలువడిన ఫలితాల్లో ఈ రెండు చోట్లా వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు.

రెండు చోట్లా డిపాజిట్ గల్లంతు…

ఇక కేఏ పాల్‌కి మాత్రం రెండు చోట్లా డిపాజిట్ కూడా దక్కలేదు. నర్సాపురం అసెంబ్లీ స్థానంలో పాల్‌కు 281 ఓట్లు పడ్డాయి. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 1133.  అలాగే నర్సాపురం లోక్‌సభ స్థానంలో ఆయనకు 2987 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక్కడా నోటాకు లభించిన ఓట్లు 10391. ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి రాష్ట్రంలో ఒక్కచోట కూడా డిపాజిట్టు దక్కలేదు. అసలు ఎక్కడా కూడా 300కు ఓట్లు మించి పడలేదు. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో కేఏ పాల్ ఆటలో అరటిపండులా మిగిలిపోయారు అన్నమాట.

చదవండి: కేఏ పాల్‌కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Advertisement -