హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుతోపాటు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ తొలి జాబితాలోని 105 మంది అభ్యర్థులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి కేవలం 42 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఈ నేపథ్యంలో మలివిడత ప్రచారం, గెలుపు వ్యూహాలపై కేసీఆర్ అభ్యర్థులకు వివరించారు. అలాగే గడిచిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో వివరించారు.
అలాగే ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్ పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి అన్న అంశంపై కూడా ఈ సమావేశంలో కేసీఆర్ వివరించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, పాక్షిక మేనిఫెస్టోపై ప్రజాస్పందనపై ఆరా తీస్తున్నారు.
అలాగే పూర్తిస్థాయి మేనిఫెస్టో త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల గురించి ఎమ్మెల్యే అభ్యర్థులను అడిగి అడిగి తెలుసుకుంటున్నారు.