26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‘బైసన్ పోలో’పై తొలగిన అడ్డంకి!: కేంద్రాన్ని తెలంగాణ సంప్రదించవచ్చన్న హైకోర్టు, కానీ..

‘బైసన్ పోలో’పై తొలగిన అడ్డంకి!: కేంద్రాన్ని తెలంగాణ సంప్రదించవచ్చన్న హైకోర్టు, కానీ..

- Advertisement -

Bison Polo ground

హైదరాబాద్‌: హైకోర్టు తాజా ప్రకటనతో సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో మైదానంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు కొంతమేర తొలగిపోయాయి. ఈ భూములకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుకోవచ్చని మంగళవారం హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సచివాలయం నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

భూమిని వెంటనే బదలాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాయనున్నట్లు సమాచారం. అవసరమైతే ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుల బృందం గురువారం ప్రధాని మోడీని కలవనుంది.

బైసన్‌ పోలో మైదానం భూకేటాయింపులకు షరతులు వర్తిస్తాయి

బైసన్‌ పోలో మైదానం భూకేటాయింపులకు సంబంధించి పరిహారం, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు, ఇతర షరతులు కీలకంగా మారాయి. తాము ఇచ్చే భూమికి మూడు రెట్లు భూమి ఇవ్వాలని, పరిహారం చెల్లించాలని రక్షణ శాఖ సూచించింది. దీంతో బైసన్‌ పోలో మైదానంలోని భూమికి సమాన విలువ గల వికారాబాద్‌, హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ భూములను ఇస్తామని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. న్యాయబద్ధంగా పరిహారం చెల్లిస్తామని తెలిపింది.

మరోవైపు 90 ఎకరాల భూమికి సంబంధించి మరికొన్ని షరతులను రక్షణ శాఖ విధించింది. ప్రభుత్వ భూసేకరణ వల్ల భూములతో పాటు ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్నందున పరిహారం, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో పాటు సేవారుసుం కింద ఏటా రూ.30 కోట్లు కోరింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాల బాధ్యతను తామే చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బైసన్ పోలో మైదానం అప్పగింత ప్రక్రియపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ప్రకటించింది.

- Advertisement -