25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆదర్శమంటే ఇదీ: అంగన్‌వాడీ కేంద్రంలో ఐఏఎస్ కుమారుడు…

ఆదర్శమంటే ఇదీ: అంగన్‌వాడీ కేంద్రంలో ఐఏఎస్ కుమారుడు…

ias son
- Advertisement -

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లకు పంపుతున్న రోజులివి. ప్రభుత్వ స్కూల్స్‌లో తమ పిల్లల్ని చేర్పించే ఉపాధ్యాయులు కొందరున్నా.. వారిని వేళ్లమీద లెక్కించవచ్చు. ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరిస్తే ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి పని చేసేందుకు మాత్రం ఇటు అధికారులు గానీ, అటు ప్రభుత్వం గానీ ముందుకు రావడం లేదు.

ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన కుమారుడ్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీఓ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌. ఆయన సతీమణి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారి కావడం గమనార్హం.

మరింత మంది అధికారులు ముందుకు రావాలి: శివశంకర్

సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా లోతేటి శివశంకర్‌ పని చేస్తున్నారు. ఆయన భార్య లక్ష్మీ కూడా ఐఏఎస్ అధికారి. ఆమె ఐడబ్ల్యూఎంపీ ఏపీడీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి రెండో కుమారుడైన మూడేళ్ల సోహమ్‌ నందన్‌ను ఈ ఏడాది అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చారు. సీతంపేట-1 అంగన్‌వాడీ కేంద్రానికి ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు తీసుకువస్తారు.

వారి ఇంటి నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ అంగన్వాడీ కేంద్రం. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటాడు సోహమ్. తోటి చిన్నారులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతాడు. అందరితో కలిసే భోజనం చేస్తూ ఉల్లాసంగా ఉంటాడు. సోహమ్‌ ప్రతి రోజూ క్రమం తప్పకుండా వస్తాడని అంగన్‌వాడీ కార్యకర్త ఉషారాణి తెలిపారు. కాగా, ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెందాలంటే మరికొందరు అధికారులు ఈ బాటలో పయనించాలని సోహమ్ తండ్రి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చెబుతున్నారు.

- Advertisement -