హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచార పర్వంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారులోనే మునిగి ఉంది.
సోమవారం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా బుధవారం ఉదయం 10 మంది అభ్యర్థులతో తన రెండో విడత జాబితాను ప్రకటించింది. దీంతో మొత్తం కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య 75కు చేరుకుంది.
రెండో విడత అభ్యర్థులు వీరే…
మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
కాంగ్రెస్ రెండో విడత జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు.. మేడ్చల్- కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సిరిసిల్ల- కేకే మహేందర్ రెడ్డి, షాద్‌నగర్- ప్రతాప్‌రెడ్డి, జూబ్లీహిల్స్- విష్ణువర్దన్ రెడ్డి, భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి, ఖానాపూర్ (ఎస్టీ)- రమేశ్ రాథోడ్, ఖైరతాబాద్- డాక్టర్ దాసోజు శ్రవణ్, పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి, యల్లారెడ్డి- జాజుల సురేందర్, ధర్మపురి (ఎస్సీ) అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
‘రెడ్డి’ సామాజిక వర్గానికి ప్రాధాన్యం…
ఒక ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాలతో కలిపి కాంగ్రెస్ మొత్తం 10 మంది అభ్యర్థులతో తన రెండో విడత జాబితాను విడుదల చేసినప్పటికీ.. ఇందులో ముఖ్యంగా రెండి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు తమకే కేటాయించాలని టీ-టీడీపీ పట్టుబట్టినా కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. ఖైరతాబాద్ స్థానాన్ని దాసోజు శ్రవణ్‌కు, జూబ్లీహిల్స్ స్థానాన్ని దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికే కేటాయించింది.
మూడో జాబితాపై తీవ్ర ఉత్కంఠ…
నిజానికి 28 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ బుధవారం ప్రకటిస్తుందని తొలుత వార్తలు వెలువడ్డా, అనూహ్యంగా పది మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. దీంతో మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఇంకా ఉత్కంఠ నెలకొని ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేరు రెండో విడత జాబితాలోనూ లేకపోవడం గమనార్హం.
ఆశావాహుల తాకిడి అధికం కావడంతో…
కాంగ్రెస్ తొలి జాబితాలో టికెట్ దక్కని ఆశావాహుల్లో కొద్ది మంది మంగళవారం నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మరికొందరు ఆశావాహులుటిక్కెట్ల కోసం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, వార్ రూమ్‌ల వద్ద ప్రదక్షిణలు చేశారు. ఆశావాహుల తాకిడి అధికం కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కర్ణాటక భవన్‌లో సాగింది.
మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు.. అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరిపి రెండో విడత జాబితా రూపొందించారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం తెలుపారు.
‘పొన్నాల’కు రిక్త‘హస్త’మేనా?
కాంగ్రెస్ మూడో విడత అభ్యర్థుల జాబితా కూడా బుధవారం సాయంత్రానికల్లా ఫైనల్ కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. రెండో విడత జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్.. మూడో విడత జాబితాలో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మరోవైపు పార్టీ టిక్కెట్ కోసం ఎదురుచూస్తోన్న పొన్నాల లక్ష్మయ్యకు టెన్షన్ పట్టుకుంది. కనీసం మూడో విడత జాబితాలో అయినా తనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అని ఆయన మధనపడుతున్నారు.
అయితే గతంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యపై అప్పట్లో ఏఐసీసీ ఆదేశాలు సరిగ్గా అమలు పరచలేకపోయారనే ఆరోపణలు వచ్చాయని.. అందుకే పొన్నాలకు టిక్కెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏం తేల్చుకోలేకపోతోందని అంటున్నారు.
INC COMMUNIQUE
Announcement of second list of Congress candidates for the ensuing elections to Legislative Assembly of Telangana. pic.twitter.com/Wi2Y0XwUcK
— INC Sandesh (@INCSandesh) November 14, 2018