ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ 2018లో సీజన్-6లో తెలుగు టైటాన్స్ జట్టు ఐదో విజయం అందుకుంది. గత మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం పాలైన తెలుగు టైటాన్స్ తిరిగి పుంజుకుని పుణేరి పల్టన్ జట్టుతో హోరాహోరీ పోరాడి ఓడించింది.
జోన్ ‘బి’లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 28–25 స్కోరుతో పుణేరి పల్టన్‌పై విజయం సాదించింది. తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 పాయింట్లు, నీలేశ్ సోలంకి 6 రైడ్ పాయింట్లు సాధించగా… ట్యాక్లింగ్‌లో కృష్ణ 4 పాయింట్లతో ఆకట్టుకున్నాడు.
మరో 5 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 27–17తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్ జట్టు అనూహ్యంగా తడబడి ప్రత్యర్థి జట్టు పుణేరి పల్టన్‌కు వరుసగా 7 పాయింట్లు అనవసరంగా ఇచ్చేసి 27–23తో నిలిచింది.
ఈ దశలో రాహుల్ చౌదరి అద్భుతంగా ఆడి తమ జట్టుకి విజయం అందించాడు. పుణేరి పల్టన్ జట్టు తరఫున సందీప్ నర్వాల్ 7 పాయింట్లు, మోను 5 పాయింట్లు సాధించారు.
ప్రో కబడ్డీ లీగ్‌లో ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 41–24 స్కోరు తేడాతో యూపీ యోధాపై ఘన విజయం సాధించింది.
ప్రో కబడ్డీ లీగ్‌లో బుధవారం జరిగే మ్యాచ్‌లు…
తమిళ్ తలైవాస్ Vs హర్యానా స్టీలర్స్
యు ముంబా Vs బెంగళూరు బుల్స్