ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులందరూ ఔట్!

6:54 am, Mon, 7 October 19
telangana-cm-kcr-sensational-decision-on-rtc-strike

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. దసరా సమయంలో కార్మికులు సమ్మెకు దిగడాన్ని తీవ్ర తప్పిదంగా పేర్కొన్నారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

సమ్మెలో పాల్గొంటూ విధులకు హాజరుకాని కార్మికులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. విధులకు హాజరైన 1200 మంది సిబ్బందిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామన్నారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని కుండబద్దలుగొట్టారు. కార్మిక సంఘాలతో చర్చలు జరిపేది లేదన్నారు కేసీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ సమీక్షా సమావేశం…

ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా వచ్చే కార్మికులు ఏ యూనియన్‌లోనూ చేరబోమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలన్నారు. కొత్త సిబ్బందికి.. ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఆర్టీసీ నడపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులని, మిగతా సగం ఆర్టీసీవి ఉంటాయన్నారు. ఈ పద్ధతిలో చర్యలు చేపడితేనే బస్సులు బాగా నడుస్తాయని, ఫలితంగా రెండు మూడేళ్లలోనే సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందన్నారు.

కొన్ని చర్యలు తప్పవు…

ఆర్టీసీ మనుగడకు.. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని చర్యలు తప్పవన్నారు. తక్షణ చర్యగా 2,500 బస్సులను అద్దెకు తీసుకొని నడపాలని అధికారులను ఆదేశించారు.

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదని స్పష్టం చేశారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలన్నారు. ఆర్టీసీపై సంవత్సరానికి 1200 కోట్ల నష్టం, 5 వేల కోట్ల రుణభారం ఉందని గుర్తు చేశారు.

పండుగ సమయంలో సమ్మెకు దిగిన వారితో రాజీపడే సమస్యే ఉండదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేసీఆర్ సూచనలపై కూలంకషంగా చర్చించి నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ప్రతిపాదనలను సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనుంది.