తెలంగాణలో ఆర్టీసీ సమ్మె! ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు, ప్రత్యామ్నాయంలో అధికారులు…

3:26 pm, Sat, 5 October 19
rtc-strike-in-telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మొదలైంది. శుక్రవారం అర్థరాత్రి నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో మలిదఫా జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో సమ్మె అనివార్యమైనట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఈ సమ్మె ప్రభావం దసరా పండగకు సొంత ఊళ్లకు వెళ్లే వారిపై పడకుండా ఉండేందుకు ఆర్టీసీ యాజమాన్యం అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

సమ్మె నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల పరిధిలోని 2500 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 4,153 మంది కార్మికులు విధుల్లో చేరకుండా ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లాలో పోలీసు భద్రతతో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు…

మెట్రో రైల్ సర్వీసులను పెంచడంతోపాటు అద్దె బస్సులను రంగంలోకి దించారు. దీనికితోడు క్యాబ్ సర్వీసులు కూడా పెంచాలని ఓలా, ఉబర్ సంస్థలను ఆర్టీసీ అధికారులు కోరారు. సమ్మె నేపథ్యంలో అధికంగా ఛార్జీలు వసూలు చేయరాదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మెట్రో రైల్ అధికారులు మెట్రో రైళ్ల సర్వీసులను పెంచారు. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారు. మరోవైపు ఆర్టీసీలో అందుబాటులో ఉన్న 2100 అద్దె బస్సులకు తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపనున్నారు.

ఈ బస్సులను నడిపే డ్రైవర్లకు రూ.1,500, కండక్టర్లకు రూ.1,000, రిటైర్డ్ సూపర్ వైజర్లకు రూ.1,500, రిటైర్డ్ మెకానిక్‌లకు రూ.1,000, రిటైర్డ్  క్లర్క్‌లకు రూ.1,000 చొప్పున రోజువారీ వేతనంగా చెల్లించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

‘‘3 వేల మంది డ్రైవర్లను తీసుకుంటాం..’’

‘‘తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లను భర్తీ చేసి నడుపుతాం. 3000 మంది డ్రైవర్లను తీసుకుంటాం. 20 వేల స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వీటికితోడు ప్రైవేటు అద్దె బస్సులనూ నడుపుతాం. అవసరమైతే పోలీసుల సహకారం తీసుకుంటాం..’’ అని త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్ కుమార్  స్పష్టం చేశారు.