
హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు.
తెలంగాణలో మంగళవారం కొత్తగా 11 మందికి కరోనా సోకినట్లు సీఎం చెప్పారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 1,096కు చేరిందన్నారు. తాజాగా 43 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన తెలిపారు.
దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 628కి చేరిందని, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో ఇంకా 439 మంది చికిత్స పొందుతున్నారని ముఖ్యమంత్రి వివరించారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా సోకి చాలామంది మరణిస్తున్నారని సీఎం విచారం వ్యక్తం చేశారు. ప్రజలు సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 42.7 శాతంగా ఉందని, దేశంలో కరోనా మరణాల రేటు 3.37 శాతంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం 2.64 శాతంగా ఉందని.. కరోనా వైరస్ కట్టడికి కృషి చేసిన అధికారులు, నాయకులు, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు.
కరీంనగర్ దేశంలోనే మొట్టమొదటి కంటైన్‌మెంట్ జోన్ అని, అయినప్పటికీ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకున్నామని, కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ నూటికి నూరు శాతం విజయం సాధించినట్లు తెలిపారు.
కరీంనగర్ నుంచి నేర్చుకుని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అమలు చేశామని, ముందు నుంచీ పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే వైరస్‌ను అదుపు చేయగలిగామని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చాలా సీరియస్‌గా జరుగుతున్నాయని, వచ్చే ఆగస్టు, సెప్టెంబరు మాసాలకల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








