హైదరాబాద్: మహాకూటమి తరపున కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా టీడీపీ నేత నందమూరి సుహాసిని శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, నేతలు తరలివచ్చారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సుహాసిని తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున హాజరయ్యారు.
చదవండి: ‘‘అక్క గెలుపు కోసం తమ్ముళ్లు వస్తారు’’, నందమూరి సుహాసిని ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ…
నామినేషన్ వేయడానికి ముందుగా శనివారం ఉదయం నందమూరి సుహాసిని.. బాలయ్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ చేరుకుని అక్కడ దివంగత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. తాను గెలిస్తే కూకట్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానన్నారు. ఇప్పుడు నామినేషన్ కూడా దాఖలు చేయడంతో ఇక నందమూరి సుహాసిని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ స్పందన ఇలా…
మరోవైపు తమ అక్క నందమూరి సుహాసిని పొలిటికల్ ఎంట్రీపై ఆమె తమ్ముళ్లు, సినీనటులు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్న అక్క సుహాసినికి ఆల్ ది బెస్ట్’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, ‘సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సోదరి సుహాసినికి ఆల్ ది బెస్ట్’ అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
ఇంకా.. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సొదరుడు కల్యాణ్ రామ్ తెలిపారు. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదన్నారు. తమ తండ్రి హరికృష్ణ సేవలు అందించిన టీడీపీ తరఫున కూకట్ పల్లి నుంచి తమ సోదరి సుహాసిని పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.
సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్రను పోషించాలని నందమూరి కుటుంబం నమ్ముతుందని ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తమ సోదరి సుహాసినిని ఈ ఎన్నికల్లో విజయం వరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018