హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తన మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 13 మంది అభ్యర్థులకు స్థానం కల్పించింది. ఈ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా ఉండడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, తాజాగా శనివారం 13 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితా విడుదల చేసింది.
మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగతా 25 సీట్లను మిత్రపక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఆ పార్టీ కేటాయించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో అత్యధికంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు 32 సీట్ల దక్కగా, బీసీలకు 18, మైనార్టీలకు 8, ఎస్టీలకు 10, ఎస్సీలకు 15 స్థానాలు దక్కాయి.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు స్థానాల చొప్పున బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలంటూ కాంగ్రెస్‌లోని ఆ వర్గం నేతలు ఏఐసీసీ పెద్దలను కోరగా.. 31 కేటాయించేలా సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. అయితే కూటమిలోని మిగతా పార్టీల సీట్లనూ కలుపుకుంటేనే బీసీ అభ్యర్థులు ఈ సంఖ్యకు చేరతారు.
మరీ ఇంత తాత్సారమా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేసుకుని, బీ-ఫారాలు కూడా అందజేసి.. ముమ్మరంగా నామినేషన్ల ఘట్టంలో పాల్గొంటూ.. ఇతర పార్టీలతో పోల్చితే.. ప్రచార పర్వంలోనూ ఒక అడుగు ముందే ఉంది. ఇక టీఆర్ఎస్‌ను మట్టికరిపిస్తామంటూ ఏర్పాటైన మహాకూటమిలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించడంలో మాత్రం తాత్సారం చేస్తోంది.
‘పొన్నాల’ సేఫ్… ‘మర్రి’ సంగతేంటి?
తాజాగా ఆ పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో.. జనగామ స్థానం నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, బోథ్ నుంచి సోయం బాపూరావులకు టికెట్ దక్కింది. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కి చేరుకోగా, మరో 6 స్థానాలకు ఇంకా ఆ పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. అలాగే సనత్‌నగర్ స్థానం ఆశిస్తోన్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఇంకా ఎదురుచూపులు తప్పడంలేదు. మరోవైపు ఈ సీటునూ పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
మూడో జాబితాలో.. టిక్కెట్ దక్కించుకున్న అభ్యర్థులు వీరే:
బోథ్ (ఎస్టీ) – సోయం బాపూరావు,
నిజామాబాద్ అర్బన్ – తహెర్ బిన్ హమ్దాన్,
నిజామాబాద్ రూరల్ – రేకుల భూపతి రెడ్డి,
బాల్కొండ – ఇ అనిల్ కుమార్,
ఎల్బీనగర్ – డి. సుధీర్ రెడ్డి,
కార్వాన్ – ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ,
యాకత్ పురా – కె. రాజేందర్ రాజు,
బహదూర్‌పురా – కలీం బాబా,
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి,
దేవరకొండ (ఎస్టీ) – బాలూ నాయక్,
తుంగతుర్తి (ఎస్సీ) – అద్దంకి దయాకర్,
జనగాం – పాన్నాల లక్ష్మయ్య,
ఇల్లెందు (ఎస్టీ)- బానోతు హరిప్రియా నాయక్
చదవండి: తెలంగాణ ఎన్నికలు 2018: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, తొలివిడతగా 65 మంది…
చదవండి: కాంగ్రెస్-సీపీఐ నడుమ చల్లారిన చిచ్చు.. 3 అసెంబ్లీ, 2 ఎమ్మెల్సీలతో సరిపుచ్చుకున్నకామ్రేడ్లు!