హైదరాబాద్: విద్యార్థులను చేరవేసే బస్సుల ఫిట్‌నెస్‌పై రాష్ట్ర రవాణాశాఖ అధికారులు గట్టి నిఘా పెట్టారు. ఫిట్‌నెస్ లేకుండా విద్యాసంస్థల బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2018-19 విద్యాసంవత్సరానికిగాను బుధ వారం నుంచి ఫిట్‌నెస్ చెక్ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత, నిబంధనలపై కూడా అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థలకు (పాఠశాలలు, కళాశాలలు) 26,463 బస్సులున్నాయి. వీటిలో 20,888 బస్సులకు ఫిట్‌నెస్ ఉండ గా, 3,284 బస్సులకు లేదు. 15 ఏళ్లు దాటిన బస్సులు 2,291 ఉన్నాయి. 2017-18 విద్యాసంవత్సరంలో పనిచేసిన బస్సుల ఫిట్‌నెస్ గడువు మంగళవారంతో ముగిసింది. 15 ఏళ్లు దాటిన బస్సులు మినహా 24,172 బస్సుల ఫిట్‌నెస్‌ను బుధవారం నుంచి చెక్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
జూన్ ఒకటి నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే విద్యాసంస్థల ప్రతి బస్సు ఫిట్‌నెస్ తనిఖీలకు వచ్చి, సర్టిఫికెట్ పొందేలా యాజమాన్యాలకు నోటీసులు జారీచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బస్సులతోపాటు వ్యాన్లు, ఆటోలపై కూడా దృష్టిపెట్టారు. వాటి డ్రైవర్లకు కూడా ఫిట్‌నెస్, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వీటిలో డ్రైవర్లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి జిల్లాకు నాలుగు బృందాలు…
స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనుండటంతో ప్రతి జిల్లాకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జేటీసీ, డీటీవోల పర్యవేక్షణలో ఆర్టీవో, ఎంవీఐ, ఏఎంవీఐతో కూడిన బృందాలను రంగంలోకి దించుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి నడిచే విద్యాసంస్థల వాహనాలను గుర్తించి సీజ్ చేయనున్నారు. ఈ నెలాఖరు వరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందని వాహనాలను గుర్తించి, తొలుత యాజమాన్యాలకు నోటీసులు జారీచేయనున్నారు. ఫిట్‌నెస్ లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 19 వేల స్కూల్ బస్సులు ఉండగా, అందులో తొమ్మిది వేల బస్సులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తిరుగుతున్నాయి.
గ్రేటర్‌లో పత్తాలేని 1,182 బస్సులు…
గ్రేటర్ పరిధిలో మేడ్చల్, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సంబంధించినవి 12,083 బస్సులు ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పిట్‌నెస్‌తో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డుపై ప్రయాణించాల్సి ఉంటుంది. అధికారులు ఎన్ని జాగ్రతలు పాటించినా గత ఏడాది విద్యా సంస్థలకు చెందిన 1,182 బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి కార్యాలయానికి రాలేదు. గత ఏడాది ఇదే నెలలో పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఫిట్‌నెస్ డ్రైవ్ చేపట్టినా కొన్ని బస్సు లు దూరంగా ఉన్నాయి. చాలా వరకు దొంగచాటుగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందిన బస్సుల నంబర్లను పెట్టుకొని రోడ్లపై తిరుగుతున్నాయి.
వెస్ట్‌జోన్ పరిధిలో జరిగిన తనిఖీల్లో ఒకే నంబర్ కలిగిన రెండు బస్సులను గత ఏడాది రవాణాశాఖ అధికారులు పట్టుకోవడంతో విషయం బయటపడింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీలో కూడా అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. వాహనాలు కార్యాలయాలకు రాకుండానే వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇటువంటి ఆరోపణలకు తావులేకుండా ఉండేందుకు గ్రేటర్ పరిధిలోని జేటీసీ పాండురంగనాయక్, రంగారెడ్డి జిల్లా డీటీసీ ప్రవీణ్‌రావు, మేడ్చల్ డీటీవో పుప్పాల శ్రీనివాస్ ఆయా జిల్లాల పరిధిలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం ప్రతి వాహనం కార్యాలయానికి రావాల్సిందేనని ఆర్టీవోలకు ఆదేశాలు జారీచేశారు.
ఫిట్‌నెస్ తప్పనిసరి: రమేశ్, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్
విద్యార్థులను విద్యాసంస్థలకు తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లు, ఆటోలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. బుధవారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపడుతాం. ఫిట్‌నెస్ లేకుండా వాహనాలు దొరికితే సీజ్ చేస్తాం. తనిఖీలు చేసి వాహనం కండీషన్‌తో ఉంటేనే వదిలేస్తాం. విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. ఫిట్‌నెస్‌లేని వాహనాల్లో విద్యార్థులు ప్రయాణించకుండా చూడాలి.