హైదరాబాద్: పంజాగుట్టలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రశాంత్ ఆత్మహత్యతో విషాదం చోటు చేసుకొంది. వారం రోజుల క్రితమే తాను ఆత్మహత్యకు పాల్పడుతానని తన బావకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. తన భార్య ప్రవర్తన కారణంగానే మనోవేదనకు గురైన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్ (34) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతనికి వరంగల్‌కు చెందిన పావనితో 2014లో వివాహం జరిగింది. వీరిద్దరూ శ్రీనగర్‌కాలనీలోని పద్మజ మాన్షన్ అపార్ట్‌మెంట్ ఉంటున్నారు.
ప్రశాంత్ కొద్ది రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ విషయమై పెద్దల మధ్య పంచాయితీ కూడా పెట్టాడు. ఈ గొడవల కారణంగా ప్రశాంత్‌ను చచ్చిపోమంటూ అతని భార్య శాపనార్థాలు పెట్టేదని ప్రశాంత్ తమకు చెప్పేవాడని అతడి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ గొడవలతో మనోవేదనకు గురైన ప్రశాంత్ మంగళవారం సూసైడ్ లేఖ రాసి బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సూసైడ్ లేఖ తన చావుకు భార్యయే కారణమని ఆరోపించారు. తమ కొడుకు చావుకు కోడలే కారణమని ప్రశాంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుని తండ్రి లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పరువుపోయింది, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా..
ఆత్మహత్యకు వారం రోజుల ముందు తన బావకు ఫోన్ చేసిన ప్రశాంత్.. తన భార్య కారణంగా పరువుపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తనకు మనశ్సాంతి లేకుండాపోయిందని, చచ్చిపోతేనే తనకు విముక్తి లభిస్తుందని అతడు అన్నట్లు సమాచారం. అయితే అలాంటి పిచ్చిపని ఎప్పుడూ చేయొద్దని, చచ్చి సాధించేది ఏమీ లేదని ప్రశాంత్‌కి అతడి బావ నచ్చజెప్పారు. కావాలంటే భార్యతో విడాకులు తీసుకోమని ఆయన ప్రశాంత్‌కి సూచించినట్లు తెలుస్తోంది.