1947 ఆగస్టు 15 నాటి నుంచి..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత .. అంటే 72 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రోజుల్లో రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రజల కోసం సేవ చేయాలనుకునే సేవాభావం ఉన్నవాళ్లే ఉండేవారు. వారిలో ప్రజలకు కించిత్ అన్యాయం చేయాలనే భావనే ఉండేది కాదు… ఇంకా చెప్పాలంటే తమ యావదాస్తి కూడా ధారపోసే.. చివరికి రోడ్లపైకి వచ్చినవారు ఎందరో.. వారిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల్లాంటివారున్నారు.. అది ఆనాటి ప్రజాప్రతినిధుల తీరు..
స్వాతంత్ర్యం వచ్చి సగం ఏళ్లు గడిచాయి.. అంటే 36 ఏళ్ల తర్వాత..
జవహర్ లాల్ నెహ్రూలాంటి వాళ్లు కాలం చేశారు. ఇందిరాగాంధీలాంటి వాళ్ల రాజ్య పాలన సాగుతున్న రోజులు..
అప్పటికే రాజ్యాలు పోయాయి. కానీ రాజ్యాధికారాలు మాత్రం మనుషుల్లో ఉండిపోయాయి. రాజులమని చెప్పుకునే వారు లేకపోయినా నాయకులమని చెప్పుకునే వారు బయలుదేరారు. రాజ్యాధికారాల స్థానంలో ప్రజా ప్రభుత్వాలు, వాటికున్న సర్వోత్తమాధికారాలు వచ్చి చేరాయి. రాజులకు ఉన్న వందిమాగధులు, రాజు వెనుక బయలుదేరే మందీమార్బలం.. అంతా యథాతథాంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వరకు వచ్చేశాయి.
ఒక ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి వెళుతుంటే వెనుక బోలెడన్ని కార్లు.. రయ్..రయ్..రయ్ మని వెళ్లిపోతుంటాయి. రాజుల కాలంలో గుర్రాలు, గుర్రపు బండ్లు అలా తిరిగేవి.. ఇప్పుడు అధికారం కావాలి.. నాడు రాజు తర్వాత కొడుకు రాజయ్యేవాడు. లేదా వారి బంధువుల్లోని వారు… ఇలా ఉండేది. బయటవారికి అవకాశం ఉండేది కాదు..
ఇప్పుడూ అవే వారసత్వ రాజకీయాలు. కొడుకు లేదా కూతురికి వారసత్వంగా తాము అనుభవించిన పదవిని ఇచ్చేందుకు ఎంతకైనా దిగజారిపోవడం, అలాగే ఆ రోజున రాజ్యం కోసం యుద్ధాలు జరిగేవి.. ఇప్పుడు పదవులు, అధికారాల కోసం కుతంత్రాలు, మోసాలు, అవినీతి, దారుణాలు జరుగుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొనేస్తున్నారు.. ఇలా ఒకటి కాదు.. ఎంత అవినీతి జరగాలో అంతా పబ్లిక్ గా జరిగిపోతోంది.
ప్రస్తుతం..
ఒక ప్రధానమంత్రి వస్తే ప్రత్యేక విమానం, ఇక ముఖ్యమంత్రులు ఏమన్నా తక్కువ తిన్నారా? వాళ్లు రాష్ట్రంలో జిల్లాల పర్యటనలకు వెళుతుంటే.. హెలికాఫ్టర్లు.. మంత్రులు కూడా తామేమీ తక్కువ తినలేదంటూ వారికి కూడా ప్రత్యేక కాన్వాయ్, ఇక ఎమ్మెల్యేలకు వారి స్థాయికి తగినట్టుగా వారు తిరుగుతున్నారు. ఈ పైత్యం కిందిస్థాయి జడ్పీ ఛైర్మను, మున్సిపల్ ఛైర్మన్ల స్థాయికి కూడా పాకింది. ఇక్కడందరూ గమనించాల్సింది..
ప్రజల సొమ్ముతో సొంత పెత్తనాలు. అంటే సొమ్మొకరిది.. సోకొకరిది అన్నమాట. మీకు తెలుసా?
ఒక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తే.. అయ్యే ఖర్చు.. రూ.5 – 7 కోట్లు.
ఇది ప్రజల సొమ్ము.. కానీ ఇష్టం వచ్చిన రీతిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వస్తే జరిగే ఖర్చు అక్షరాలా.. రూ.5 కోట్ల నుంచి 7 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే మీటింగులు, జనం తరలింపునకు ఉపయోగించే ఆర్టీసీ బస్సుల అద్దెల దగ్గర నుంచి.. ఆయన ఉపయోగించే హెలికాఫ్టర్ ఛార్జి వరకు..
అదే ప్రధాన మంత్రి వస్తే ఈ ఖర్చు ఇంకా పెరుగుతుంది. ఇక విదేశీ పర్యటనల ఖర్చుకైతే అంతే లేదు. కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక విమానాలు వేసుకొని మరీ తిరిగి వస్తుంటారు. మరక్కడ ఏం చేసారన్నది కనీసం ప్రజలకు చెప్పరు. ఈ ఊరు వెళితే ఇంత ఖర్చయ్యింది.. దాని నుంచి ఇంత మనం లబ్ధి పొందామనే సోషల్ ఆడిట్ ఊసే ఉండదు.
ఇక్కడ ప్రతిపక్షాలూ అడగవు.. ప్రభుత్వాలు చెప్పవు..
ఐదేళ్ల తర్వాత.. వీరు అధికారంలోకి వచ్చినా అంతే.. లేదా వారు వచ్చినా.. అంతే..
ఎవ్వరూ కిమ్మనరు.. ఎవరూ ఎవరిని అడగరు, ప్రశ్నించరు.. ఇదే అంతర్గత ప్రజాస్వామ్యంలో ఒప్పందాలు..
ఇప్పుడా లైన్ దాటేస్తున్నారు.. అంటే బోర్డరు దాటి రాజకీయాలు పరుగులెడుతున్నాయి..
ఇంతవరకు ఏ ప్రతిపక్ష పార్టీలు.. గత ప్రభుత్వం సొంతానికి వాడిన ఖర్చుల వివరాలు లెక్క తీయలేదు. అడగలేదు.. ఇక్కడ నుంచి ప్రజలు ఒక నీతి నేర్చుకోవాల్సి ఉంది. అంటే ఒక ‘ఎక్స్’ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదేళ్ల తర్వాత.. ‘వై’ పార్టీ అధికారంలోకి వచ్చిందని అనుకుందాం. ఎక్స్ ఏవైతే అవినీతి పనులు చేసిందో.. వై పార్టీ అడగదు.. తర్వాత మళ్లీ ఐదేళ్ల తర్వాత.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఒకరి తప్పులు ఒకరు తవ్వుకోరు.. ఎంతసేపూ ఎత్తి చూపుతుంటారంతే.. చట్ట సభలలో నిలదీస్తుంటారంతే..
ఇటీవల ‘భరత్ అనే నేను..’ సినిమాలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలందరూ ఒకచోట చేరుతారు. కాంట్రాక్టులు, లావాదేవీలు, సెటిల్మెంట్లు.. ఎవరి స్థాయికి తగినట్టు వారు చేసుకుంటుంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే.. వారి జోలికి వెళ్లకూడదన్నమాట..
కానీ ఒకరోజు… హఠాత్ పరిణామం…
భారతదేశంలోని ఒక రాష్ట్రంలో.. హఠాత్తుగా రాష్ట్రాన్ని పాలించే ఒక ముఖ్యనేత మరణించాడు. అయితే ఆ స్థానంలో పదవిని ఎవరికివ్వాలనే తర్జనభర్జన జరుగుతుండగా.. ఆ నేత కొడుకు ఆశ పడ్డాడు. ఆశ పడటమే కాదు.. రాజకీయనాయకులు కూడా ఎగదోశారు. నీదే పదవి.. నీదే పదవి.. అని.. అలాగే ఢిల్లీలో ఈ పార్టీ పైస్థాయి నేతలకు..ఇంతమంది సీనియర్లు ఉండగా.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాడు.. కేవలం తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని పదవి అనుభవించాలని అనుకుంటున్నాడంటూ వివాదం లేవదీశారు.
అది చినికి చినికి గాలివానయ్యింది. ఆ తరువాత స్వపక్ష, విపక్షాలన్నీ కలిసి.. సీఎం పీఠం కోసం అర్రులు చాచిన ఆ ముఖ్యనేత కుమారుడు జైలు పాలయ్యే వరకూ ఊరుకోలేదు. తండ్రి అధికారంలో ఉండగా.. అధికార దుర్వినియోగం చేశాడనే అభియోగాలు మోపడం, అతను అవినీతి పరుడని ప్రచారం చేయడం.. అతడి వ్యాపారాలకు నష్టం కలిగించడం..అంతా ఒక సీరియల్ గా జరిగిపోయాయి.
పవర్ లో ఉన్నప్పుడు.. ఆ పవర్ గేమ్ ని.. రాజకీయాల్లో ఉన్నవారిపై ఉపయోగించ కూడదు. ఎందుకంటే పవర్ ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదు. ఐదేళ్లకొకసారి చేతులు మారుతుంటుంది. పొరపాటున అవతలి వారి చేతికి వెళితే.. ఇవతలి వారి వల్ల నష్టపోయిన వారు ఊరుకుంటారా? అదే సమయం వచ్చినప్పుడు అవకాశంగా వాళ్లూ తిరిగి అదే పవర్ గేమ్ మొదలుపెడితే..
రాజకీయంగా ఎదిగినవారిపై వ్యక్తిగత దాడికి దిగకూడదు, ‘అధికారాన్ని’ ఉపయోగించకూడదు..
అనే అంతర్గత నీతి సూత్రాన్ని ఈ ముఖ్యనేత కుమారుడి విషయంలో వారు పక్కన పెట్టారు. ఐదేళ్లు తమ చేతిలో ఉండే ‘ఆలీబాబా అద్భుత దీపం’ అనే పవర్ ని ఉపయోగించి.. వ్యక్తిగత నష్టానికి దిగిపోయారు. ఈ దెబ్బకి రాజకీయ అప్రదిష్ట, వ్యాపారాల్లో నష్టం, ఆర్థిక అష్ట దిగ్బందనం.. వీటన్నింటికి తోడు.. జైలుకి కూడా పంపించడం.. ఇవన్నీ చకచకా కుమారుడి జీవితంలో జరిగిపోయాయి. అంటే..వారు చేసిన పొరపాటేమిటంటే..
వారి మధ్యలో ఉన్న ఒక ‘ఇన్ సైడర్’ అగ్రిమెంటు కాలరాశారు..
అలా వారిలో వారు అంతర్గతంగా ఏర్పాటు చేసుకున్నఒక ‘లైన్ క్రాస్’ చేసేశారు..
అంటే.. తెలుగులో చెప్పాలంటే ‘లక్ష్మణ రేఖ’ దాటారు..
ఐదేళ్లు గడిచాయి. ఇప్పుడు కాలచక్రం మారింది. చంద్రుడు అటు వెళుతున్నాడు..సూర్యుడు ఇటు వస్తున్నాడు. కేంద్రంలో అధికారం కూడా కుమారుడి వైపై ఉంది. సేమ్ ఆరోజు తన తండ్రి చనిపోయినప్పుడు.. ఎటువంటి దాడి ఎలా జరిగిందో.. అదే తరహాలో కుమారుడిపై దాడి చేసినవారిపై ఇప్పుడు గేమ్ ప్లాన్ రివర్స్ లో అమలవుతోంది.
ఈ రోజున అన్యాయం జరుగుతోంది.. అన్యాయం జరుగుతోంది.. అని గొంతెత్తి అరుస్తున్నారు. ఆరోజు ఆ కుమారుడు జైలు నాలుగు గోడల మధ్య అరిచాడు. ఆ అరుపులు విన్నవారే లేరు. అతని వేదన అరణ్యరోదనే అయ్యింది. అవినీతి పరులంటూ బయట బీభత్సమైన దాడి..రోజురోజుకి పోతున్న పరువు.. బయటకు రాలేని పరిస్థితి..
అందరూ మరిచిపోయినా.. ఆ కుమారుడు మరిచిపోలేదు. దాని ఫలితమే.. ఇప్పుడు జరుగుతున్న సరికొత్త రివర్స్ రాజకీయాలు.. దీంతో ఇంటా బయటా సమస్యలతో రాజకీయాలు బోర్డర్ దాటి.. కేంద్రం వైపు వెళ్లాయి. ఆరోజున రాజకీయ అంతర్గత ఫార్ములా ప్రకారం.. ఆ కుమారుడి కేసును మరోరకంగా చూడాల్సింది.. ఇప్పుడదే రివర్స్ ఫార్ములాగా మారి.. వేసినవారిపైకే భస్మాసురిడి హస్తంలా దూసుకు వెళ్లిపోతోంది.
స్వర్గం-నరకం భూమ్మీదే ఉన్నాయి.. కర్మ ఫలం అనుభవించక తప్పదు..
కాల చక్రం మారింది. ప్రస్తుతం టైం మారింది. స్వర్గం- నరకం అనేవి ఎక్కడా లేవు. ఈ భూ మ్మీదే ఉన్నాయని ఆధ్యాత్మిక ప్రవచకులు చెప్పేమాట.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పే మాట.. నీవీ జన్మలో అనుభవించే అదృష్టం ఇప్పటిది కాదు.. గత జన్మలో చేసుకున్నది.. ఈ జన్మలో కలిగిన కష్టం ఇఫ్పటిది కాదు.. గత జన్మలో చేసిన పాప ఫలితం.. అది అనుభవించక తప్పదు..
అందువల్ల మనం ఒక పొరపాటు చేస్తే.. అది తప్పనిసరిగా రివర్స్ అవుతుంది. పవర్ గేమ్ గురించి తెలుసుకున్న వారందరూ.. ఎందుకిలా ఇంటా.. బయటా.. పరుగులు పెడుతున్నారనేది ఒక ప్రశ్న. . ఇప్పుడు సమస్య పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది. ఎంతటి గొప్పవారైనా కర్మ ఫలం అనుభవించాల్సిందే..