హైదరాబాద్: కాంగెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన భార్య గీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం కోస్గిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించి, ఆరోజున కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే కొడంగల్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకుని వెళ్లి ఆయన్ని ముందస్తు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరులను, గన్‌మెన్లను, పలువురు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ప్రశ్నిస్తే.. దాడులా?
ఈ ఘటనపై రేవంత్ రెడ్డి భార్య గీత పోలీసుల చర్యను ప్రశ్నించారు. అర్థరాత్రి పూట కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి భయభ్రాంతులకు గురిచేసి, మహిళలను ఇబ్బంది పెడుతుంటే రేవంత్ రెడ్డి నిరసనకు దిగారని.. ఇలాంటి దాడులు ఇంకా జరిగే అవకాశం ఉందని కూడా ఆయన అదే రోజు హెచ్చరించారని తెలిపారు.
చదవండి: రేవంత్ రెడ్డి అరెస్ట్.. అర్థరాత్రి పోలీసుల హైడ్రామా, ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య…
కొడంగల్ ప్రజలమీద జరుగుతోన్న దాడులకు రేవంత్ రెడ్డి అరెస్టు కొనసాగింపు అని గీత వ్యాఖ్యానించారు. మగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తమ ఇంటి తలుపులు బద్దలుగొట్టి ఒక 50 మంది పోలీసులు లోనికి చొరబడ్డారని, ఏకంగా తమ బెడ్‌రూంలోకే వచ్చేశారని, ఆ సమయంలో తన భర్తను వారు ఒక ఉగ్రవాదిలా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?
అదేమని అడిగితే పైఅధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు చెప్పారని, ఇది ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అంటూ గీత నిలదీశారు. ఓటమి భయంతో కేసీఆర్ ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
‘‘కొడంగల్ అభివృద్ధిని అడ్డుకున్నారు… మా ప్రాంత ప్రజల మీద పోలీసులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇక్కడకు వచ్చి ప్రచారసభలు ఎలా పెడతారో సమాధానం చెప్పాలని అడిగినందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు మాపై ఇలా అరాచకానికి దిగారు..’’ అంటూ మండిపడ్డారు. ప్రాజెక్టులు, పరిశ్రమలను ఎందుకు అడ్డుకున్నారని నిలదీస్తే సమాధానం చెప్పకుండా బలప్రయోగం చేస్తున్నారని గీత ఆరోపించారు.
ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి అని, కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా తమ నిరసన తెలిపాలని, హింసకు పాల్పడవద్దని ఆమె పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించి, నియంత కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని ఆమె ప్రజలను కోరారు.