హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని మరోసారి అరెస్ట్ చేశారు. కొడంగల్‌లో ఈనెల 4 (మంగళవారం) జరిగే ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో.. కేసీఆర్‌ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమంటూ రేవంత్ హెచ్చరించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయనపై కొడంగల్ పోలీసులు 241, 188, 506, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా వారు కమిషన్‌కు సమర్పించారు. దీంతో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోమంటూ ఈసీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కొడంగల్ పోలీసులు రేవంత్ రెడ్డిపై రెండు కేసులు నమోదు చేయడమేకాకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన నివాసానికి వెళ్లి, అరెస్టు చేశారు. దీంతో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అర్థరాత్రి తలుపులు బద్ధలు కొట్టి మరీ…
రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో చాలా హైడ్రామా నడిచింది. అర్థరాత్రి దాటిన తరువాత 3 గంటల సమయంలో (తెల్లవారితే మంగళవారం) రేవంత్ నివాసంలోకి ప్రవేశించిన పోలీసులు ఆయన్ని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు కనీసం ఐడీ కార్డులు కూడా చూపించకుండా రేవంత్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
తలుపులు తీయకపోవడంతో వాటిని బద్దలు కొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరులను, వాచ్‌మన్, గన్‌మెన్లను కూడా అరెస్టు చేశారు. ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈడ్చుకెళ్లారు.. నా భర్త ఉగ్రవాదా?: రేవంత్ భార్య గీత
రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై ఆయన భార్య గీత మండిపడ్డారు. అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు తమ బెడ్ రూం తలుపు గడియ కూడా విరగ్గొట్టి లోనికి ప్రవేశించారని, తన భర్త రానంటున్నా.. బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారని ఆమె ఆరోపించారు.
‘‘అయినా నా భర్త ఉగ్రవాదా? అందరి ఎదుట ఆయన్ని అలా ఈడ్చుకు వెళ్లడమేంటి?’’ అని రేవంత్ భార్య గీత ప్రశ్నించారు. అంతేకాదు, పోలీసులు కనీసం ఐడీ కార్డులు చూపించమంటే కూడా చూపించలేదని, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరింట్లోకి పడితే వారింట్లోకి వెళ్లడానికి పోలీసులకు హక్కు ఉందా? రాజ్యాంగం ఇలాంటి హక్కులనే ఇచ్చిందా? అని ఆమె ప్రశ్నించారు.
నియంత పాలనకు చరమగీతం పాడండి…
అసలు వాళ్లు పోలీసులని తాము అనుకోలేదని, ఒక అధికారి మాత్రం తాము పై అధికారుల ఆదేశాల మేరకే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారని రేవంత్ రెడ్డి భార్య గీత తెలిపారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరిగిన దాడి అని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసన తెలపాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని, తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడాలని ఈ సందర్భంగా గీత కోరారు.