అర్థరాత్రి హైడ్రామా, అరెస్ట్.. ఇంతకీ రేవంత్ రెడ్డి ఎక్కడ? నోరు మెదపని పోలీసులు…

kodangal-mla-vevanth-reddy-arrest
- Advertisement -

kodangal-mla-vevanth-reddy-arrest

హైదరాబాద్: రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇంతకీ రేవంత్ రెడ్డి క్షేమంగానే ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు.

పోలీసుల మౌనం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అర్థరాత్రి పూట.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి నివాసంలోకి బలవంతంగా జొరబడి ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానుల మదిని తొలిచివేస్తోంది.

రేవంత్ ఆచూకీపై భార్య ఆందోళన…

కొడంగల్‌లో మంగళవారం జరిగనున్న టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని చెప్పడం లేదని రేవంత్ భార్య గీత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి ప్రవేశించారని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ఆరోపిస్తున్నారు.

police-force-in-kodangalభారీ ఎత్తున పోలీసు బందోబస్తు…

మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రేవంత్‌ రెడ్డిపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు, మంగళవారం సాయంత్రం వరకు బొమ్రాస్‌పేట‌లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెబుతున్నారు.  రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కొడంగల్‌లో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే రేవంత్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసుల అధికారులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

revanth-wife-geetaరేవంత్ ఆచూకీ కోసం ఆయన భార్య ఏం చేసిందంటే…

తన భర్త ఆచూకీ చెప్పాలంటూ రేవంత్ రెడ్డి భార్య గీత పోలీసులను ప్రశ్నించారు. అసలు తన భర్తను అరెస్ట్ చేసింది పోలీసులేనా? ఇంకెవరైనా ఆయన్ని ఎత్తుకెళ్లారా? ఒకవేళ అరెస్ట్ చేసింది పోలీసులే అయితే.. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని రేవంత్ రెడ్డి భార్య వ్యాఖ్యానించారు.

పోలీసులు మౌనం వహించడంతో.. రేవంత్ రెడ్డి ఆచూకీ తెలపాలని కోరేందుకు తన ఇంటి నుంచి రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు వెళ్లడానికి గీత ప్రయత్నించగా, ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

రిటర్నింగ్ అధికారిని కలుసుకోనివ్వని పోలీసులు…

144 సెక్షన్ ఉందని, బయటికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు పేర్కొనడంతో.. మరి 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను గీత ప్రశ్నించారు. అంతేకాదు, అసలు 144 సెక్షన్ ఉన్నట్లుగా తనకు రాత పూర్వక ఆధారాలు చూపాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

తన భర్త ఆచూకీ తెలపాలంటూ తాను రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు వెళుతున్నానని, తనతోపాటు నలుగురిని మాత్రమే తీసుకెళతానని, తమ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరూ తమ వెంట రారని రేవంత్ రెడ్డి భార్య గీత హామీ ఇచ్చినా.. పోలీసులు అందుకు కూడా ఒప్పుకోలేదు.

ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఎవరూ సంయమనం కోల్పోకూడదని, శాంతియుతంగానే తమ నిరసన తెలియజేయాలని గీత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

 

- Advertisement -