హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుదవారం ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవనంకు చేరుకున్నారు. అధికారులు ఇటీవల రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలకు సంబంధించి ఆయన్ని విచారించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ స్నేహితులను కుటుంబసభ్యులను ఐటీ అధికారులు విచారించారు. అధికారులు ప్రధానంగా ఓటుకు నోటు కేసులో జరిగిన లావాదేవీల గురించే దృష్టి పెట్టారు. రెవంత్‌రెడ్డి ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్ళలో 16 ప్రాంతల్లో గత నెల 27, 28 తేదీల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
ఆ సందర్బంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్న లాప్‌టాప్, హార్డ్ డిస్కులు, ఇతర ప్రతాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటిసులు ఇచ్చారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. సోదాల సందర్భంగా రేవంత్ ఇంట్లో ఐటీ అధికారులు దాదాపు 40 గంటల పాటు పలు పత్రాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్, ఆయన భార్య గీతను పలు ప్రశ్నల సంధించారు. ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయల గురించే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ రోజు జరిగే విచారణలో రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు దీనిపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సోమవారం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ పద్మనాభరెడ్డి, స్నేహితుడు ఉదయసింహ, సెబాస్టియన్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు ఓటుకు నోటు కేసు విషయంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన భూపాల్ ఇన్ ఫ్రా సంస్థతో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలపైనా వివరాలు సేకరించే అవకాశం ఉంది. రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెట్‌లో 20 కోట్ల రూపాయలు లెక్క తేలని ఆదాయన్ని గుర్తించిన అధికారులు… ఆ సంస్థలో రేవంత్ భాగస్వామ్యం గురించి ఆరా తీసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి చిరునామాపై అనేక కంపెనీలు రిజిస్టర్ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆయ కంపెనీలతో రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో ఆరా తీసే అవకాశం ఉంది.