
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ…కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క ఇందిరా పార్కు వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. రేవంత్ ఈ దీక్షకు మద్ధతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి మొన్నటి ఎన్నికల్లో అంతమందే మిగిలారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్‌కు కూడా 12 మంది ఎమ్మెల్యేలే మిగులుతారని జోస్యం చెప్పారు.
ఇక సెప్టెంబర్ 21, 2016లో టీడీపీ విలీనం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. సీఎల్పీ విలీనం నిబంధనల ప్రకారమే జరిగిందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలను వినని స్పీకర్, 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
విలీన అంశం స్పీకర్ పరిధిలోనిది కాదని, అసలు ఆ అధికారం స్పీకర్‌కు లేదని రేవంత్ పేర్కొన్నారు. పార్టీని వీడుతున్నట్టు లేఖలు విడుదల చేసిన ఎమ్మెల్యేలు, అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎలా సమావేశం నిర్వహిస్తారని రేవంత్ నిలదీశారు.
అసెంబ్లీ సమావేశం పెట్టి ఏ రాజ్యాంగం ప్రకారం సీఎల్పీని విలీనం చేశారో కేసీఆర్ చెప్పాలని, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు.








