హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీలో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం లేదని, ఆ పార్టీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా తయారైందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండానే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుండడం, ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాములు నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెరాస ప్రకటించడం తెలిసిందే. దీంతో రాములు నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మనోభావాలను వ్యక్తపరిచారు.
గిరిజనులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? అని ఆయన నిలదీశారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు.. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడనే లేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు.
తీవ్ర ఉద్వేగంతో.. కంటతడి పెట్టి…
ఒక దశలో రాములు నాయక్ తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి కూడా పెట్టుకున్నారు. గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారనొ, తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారని, ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. గిరిజన ఐఏఎస్‌లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని, డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు.
వాళ్లకో న్యాయం.. నాకో న్యాయమా?
డి.శ్రీనివాస్, కొండా సురేఖను సస్పెండ్ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్ చేశారని, వాళ్లకో న్యాయం.. నాకో న్యాయమా అని రాములు నాయక్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్‌లాగ్ ఉద్యోగాలే కాదు.. పదో తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చారని, తెలంగాణలో ఈ రోజు చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని రాములు నాయక్ స్పష్టం చేశారు.