ఆసక్తికరం: కానిస్టేబుల్ కొడుకు సీఎం కాలేడా? నన్ను గుర్తుంచుకోండి: ధవళేశ్వరం సభలో పవన్

pawan-dawaleswaram
- Advertisement -

pawan-marchfast

తూర్పుగోదావరి : సీఎం పదవి తనకు అలంకారం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు, వారసత్వాలతో సీఎంలు కాలేరంటూ పరోక్షంగా నారా లోకేశ్, వైఎస్ జగన్‌పై ఆయన విమర్శలు చేశారు. ధవళేశ్వరం బ్యారేజిపై సోమవారం జనసైనికుల కవాతు ప్రదర్శన అనంతరంనిర్వహించిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ‘సీఎం.. సీఎం’ అంటూ జనసేన కార్యకర్తలు, అభిమానులు నినదించగా, పవన్ స్పందిస్తూ, ‘మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది..’ అని వ్యాఖ్యానించారు.

తమ తాత, తండ్రీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు కనుక తానూ ముఖ్యమంత్రిని అవుతానని లోకేశ్, తన తండ్రి సీఎంగా చేశారు కనుక తానూ ఆ పదవిని పొందాలని జగన్ ఆలోచిస్తున్నారని, కానీ తనకు అలాంటి వారసత్వం లేదని పవన్ అన్నారు. అంతేకాదు, ఒక కానిస్టేబుల్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకు ఈ రాష్ట్రానికి సీఎం ఎందుకు కాలేడు, కచ్చితంగా అవుతాడని పవన్ అన్నప్పుడు అభిమానులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.

‘కవాతు’ సక్సెస్…

అంతకుముందు ధవళేశ్వరం బ్యారేజిపై జనసేన నిర్వహించిన కవాతుకు కూడా జనాలు వెల్లువెత్తారు. సుమారు మూడు గంటలపాటు ఈ కవాతు సాగింది. సోమవారం సాయంత్రం 3.30 గంటలకు మండలంలోని పిచ్చుకలంక వద్దకు విచ్చేసిన పవన్ కళ్యాణ్.. జన సైనికులకు అభివాదం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యారేజ్ పై నుంచే కాకుండా కాటన్‌ పాత ఆనకట్ట మీదుగా కూడా జనం సభాస్థలికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తుండగా.. కడియం నర్సరీ రైతులు పారాగ్లైడర్ సాయంతో నింగి నుంచి పూలు చల్లడం అందరినీ ఆకట్టుకుంది.

కూలిన రేకుల షెడ్డు.. తప్పిన ప్రమాదం…

ఒక దశలో పవన్‌ కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు కొందరు అభిమానులు పవన్ సరిగ్గా కనిపించడం లేదంటూ సభా స్థలికి సమీపంలో ఉన్న ఒక పాత రేకుల షెడ్డు పైకి ఎక్కడంతో అప్పటికే శిధిలావస్థలో ఉన్న ఆ రేకుల షెడ్డు అభిమానుల బరువును భరించలేక కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మొదట ఈ ప్రమాదం కారణంగా పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరగడంతో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ ఆ తరువాత అవి వదంతులేనని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాజకీయాల్లోకి అందుకే వచ్చా…

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న ఈ వ్యవస్థను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. ఒక బలమైన వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యం తనకుందని, తన తండ్రి చిన్నప్పటి నుంచే ఉన్నతమైన విలువలు నేర్పించారని.. అదే రీతిలో తాను ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. పాడైపోతున్న వ్యవస్థను చూసి తాను చలించిపోయానని… అయితే తన వద్ద కోట్ల రూపాయలేమీ లేవని, అయినా చిత్తశుద్ధి, విలువలతో పని చేస్తానని జనసేనాని అన్నప్పుడు సభాస్థలి చప్పట్లతో హోరెత్తిపోయింది.

- Advertisement -