సూర్యాపేట: తెలంగాణ ఎన్నికలలో కొత్త తరహా రిగ్గింగ్ బయట పడ్డింది. పైగా ఇది చేస్తుంది కూడా ఎవరో కాదు, ఎన్నికలను పర్యవేక్షించాల్సిన అధికారే ఈ నీఛానికి తెరతీశాడు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధ ఓటర్లు చెప్పినట్టు కాకుండా, సొంతంగా తనకు నచ్చిన పార్టీకి ఆ పోలింగ్ అధికారి ఓటు వేస్తుండడం గమనించిన స్థానికులు.. అతడ్ని పట్టుకుని చితకబాదారు.
వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెళ్లటూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 139వ నంబర్ బూత్‌లో ఉన్న ఆ అధికారి ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చిన వృద్ధ ఓటర్లు చెప్పిన గుర్తుకు, పార్టీకి కాకుండా.. సొంతంగా తనకు నచ్చిన పార్టీకి ఓటు వేయడం ప్రారంభించాడు.
దీనిని గమనించిన స్థానికులు ఆ పోలింగ్ అధికారికి దేహశుద్ధి చేశారు. ముసలి వారికి, కళ్ళు సరిగ్గా కనిపించని వారికి ఓటు ఎలా వేయాలో చెబుతానని చెప్పి… వారికి బదులు అధికారులే ఓటు వేస్తున్నారనే ఆరోపణలు పలు చోట్ల వినిపిస్తున్నాయి.