లగడపాటి నోట మళ్లీ అదే మాట: కారు జోరుకు బ్రేక్.. ప్రజా కూటమిదే గెలుపు, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం

lagadapati-rajagopal-exit-poll-survey
- Advertisement -

lagadapati-rajagopal-exit-poll-survey-results

హైదరాబాద్:  తెలంగాణలో పోలింగ్ ముగిసింది. గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  టైమ్స్ నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో ఈసారి కూడా టీఆర్ఎస్ అధికారాన్ని చేపట్టనుంది. ఇక ఇండియా టుడే, యాక్సిస్ సర్వేల్లో కూడా.. గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది.

చదవండి: ప్రభుత్వ వ్యతిరేకత.. జగ్గారెడ్డి, రేవంత్‌ల అరెస్ట్ వ్యవహారం.. ఓటర్లపై ప్రభావం చూపాయి: లగడపాటి

అయితే ఈ సర్వేల మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ లగడపాటి రాజగోపాల్ సర్వేపైకి మరలింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రజాకూటమిదే హవా అని పోలింగ్‌కు ముందే స్పష్టం చేసిన లగడపాటి.. శుక్రవారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఏం చెబుతారా అని అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది.

ఒకవైపు జాతీయ చానల్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం ప్రజా కూటమిదే అధికారమని చెప్పడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పోలింగ్‌కి ముందు 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని, పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ వస్తుందని బాంబు పేల్చిన రాజగోపాల్.. పోలింగ్ సరళి చూస్తోంటే ప్రజల నాడి హస్తం వైపే ఉందంటూ హింట్‌ ఇచ్చారు.

పోలింగ్‌కు ముందు ఏం చెప్పారంటే…

గత ఎన్నికల తరహాలోనే పోలింగ్ 68.5 శాతం గనక నమోదైతే..  హైదరాబాద్‌లో అత్యధిక సీట్లు ఎంఐఎం పార్టీకి దక్కుతాయనేది లగడపాటి రాజగోపాల్ సర్వే అంచనా.  మిగిలిన స్థానాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దక్కుతాయి. వరంగల్, నిజామాబాద్, మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా..  ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటుంది. కరీంనగర్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం  హోరాహోరీ తప్పదు.

పోలింగ్ ముగిసిన నేపథ్యంలో…

చెప్పినట్లుగానే లగడపాటి రాజగోపాల్ మళ్లీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన సర్వే ఫలితాలను వెల్లడించారు.  పోలింగ్ అనంతరం కూడా ప్రజా కూటమికే ఆయన పట్టం కట్టారు.   ప్రజా కూటమికి 65కి పైగా స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్‌కు 35 స్థానాలు వస్తాయని తేల్చి చెప్పారు.  అయితే పోలింగ్ శాతం గతంలో కంటే గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఇరు పార్టీలకు 10 స్థానాలు ఇటూ అటూ అవుతాయని పేర్కొన్నారు.

పోలింగ్ 72 శాతం వరకు…

సెప్టెంబర్ నుండి పలు దఫాలుగా ఆర్జీ ఫ్లష్ టీమ్ సర్వే నిర్వహించినట్టు చెప్పారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.5 గా నమోదైందని, అయితే ఈ దఫా 72 శాతం వరకు పోలింగ్ జరిగినట్లు సమాచారం అందుతోందని, రేపటికల్లా పోలింగ్ శాతంపై సరైన వివరాలు అందుతాయని పేర్కొన్నారు.  అలాగే తెలంగాణ గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఖర్చు జరిగిందని చెప్పారు.

ఏడుగురు స్వతంత్ర అభ్యర్థుల విజయం…

చివరి రెండు రోజులు ప్రధాన పార్టీలు ప్రచారంతోపాటు అన్ని రకాలుగా ఓటర్లను ప్రభావితం చేశాయని, దీంతో ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని,  ఈ ఎన్నికల్లో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు.  ఇబ్రహీంపట్నం, మక్తల్‌లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

టీడీపీ, టీఆర్ఎస్ ముఖాముఖి స్థానాల్లో 7 స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో గెలవడంగానీ.. కోల్పోయే అవకాశంగానీ ఉందన్నారు. సీపీఎం ఒక స్థానంలో గెలుస్తుందని, ఖమ్మం జిల్లాలో బీఎల్ఎఫ్ ఒక  స్థానంలో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు.  బీజేపీ కూడా ఓ రెండు స్థానాలు అటూ ఇటుగా 7 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని రాజగోపాల్ తెలిపారు.

 

- Advertisement -