సూర్యపేట: తెలంగాణ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ రోజైన శుక్రవారం మధ్యాహ్న భోజన సమయం అంటూ ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్‌కి తాళం వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.
వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీలోని 291వ బూత్‌లో ఎన్నికల సిబ్బంది లంచ్ కోసం పోలింగ్ బూత్ గదికి తాళం వేసి భోజనానికి వెళ్లారు. పోలింగ్ సిబ్బంది నిర్వాకంపై ఓటర్లు మండిపడ్డారు. దీంతో తాళం వేసిన సిబ్బందిపై రిటర్నింగ్ అధికారి సంజీవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి పోలింగ్‌కు నిర్దేశించిన సమయం.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏ కారణం రీత్యా పోలింగ్‌ను ఆపడానికి వీల్లేదు. నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన సమయంలో ఆధికారులు ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయడానికి వెళ్లాలి. కానీ, తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం ఎన్నికల సిబ్బంది ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం.. ఓటర్ల ఆగ్రహానికి కారణమైంది.
పోలింగ్ బూత్‌కు తాళం వేసి ఉన్న అంశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలంతా చాలాసేపు అక్కడే క్యూలో నిలబడి ఉండిపోయారు. ఆ తర్వాత కొంతమంది నిలబడలేక పోలింగ్ బూత్ ముందు కూర్చుండిపోయారు.