

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక జరిగింది. శాసనసభ స్పీకర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రకటించారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటెల రాజేందర్, అహ్మద్ బలాలా తదితరులు పోచారంను స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, గురువారం మధ్యాహ్నం శాసనసభలో పోచారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులుకు ఆరు సెట్ల నామినేషన్‌ను అందజేశారు.
గురువారం సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత గడువులోగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం రెండో శాసన సభాపతిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో 2004 నుంచి 2009 వరకు బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా పనిచేసిన విషయం విధితమే.
పోచారం వివాద రహితుడు: కేసీఆర్, కొనియాడిన నేతలు
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, ఇతర పార్టీల నేతలు అభినందనలు తెలిపారు. స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పోచారం రాజకీయ ప్రస్తానంలో వ్యవసాయశాఖ నిర్వహించడం ఉజ్వలమైన ఘట్టమని అన్నారు. పోచారం హయాంలోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాయని.. కేబినెట్‌లో ఆయన లేకపోవడం ఒక విధంగా తనకు లోటేనని కేసీఆర్ తెలిపారు.
పోచారం స్థానంలో సమర్థుడికి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరుందని, భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్షును ఆయనకు ఇవ్వాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ పోచారం పోరాడారని గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించిన ప్రతిపక్ష సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బలాలా తదితర నేతలు పోచారం సేవలను ప్రశంసించారు.
ఆదర్శంగా నడుపుకుందాం: పోచారం
తెలంగాణ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్, సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభలో తొలిసారిగా ఆయన మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని అన్నారు. అంతేగాక, ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సభను నిర్వహించుకుందామని సభ్యులకు పిలుపునిచ్చారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అనంతరం సభను శనివారంకు వాయిదా వేశారు.








