

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు దూకుడు పెంచారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ప్రభాస్‌ను ఎన్నడూ కలవలేదు.. మాట్లాడలేదు, అన్నీ పుకార్లే: వైఎస్ షర్మిల, కమిషనర్‌కు ఫిర్యాదు
దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్న సైట్లను గుర్తించారు. మొత్తం 12 యూఆర్‌ఎల్ నంబర్ల ఐపీ అడ్రస్‌ల కోసం గూగుల్‌కు లేఖ రాశారు. ఐపీ అడ్రస్సులు అందగానే సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. దీనిపై గూగుల్ నుంచి రెండు మూడు రోజుల్లో ఐపీ అడ్రస్సులు అందే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఐపీ చిరునామాల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని, రెండు మూడు రోజుల్లోనే వారి వివరాలు వెలుగులోకి వస్తాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. షర్మిల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించడం.. గూగుల్, యూట్యూబ్‌లను సంప్రదించి ఐపీ చిరునామాలు సేకరిస్తుండడంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
చదవండి: వైఎస్ షర్మిలకు విజయశాంతి మద్దతు.. న్యాయం జరిగే వరకూ పోరాడాలంటూ పిలుపు…
ఈ నేపథ్యంలో వారు వైఎస్ షర్మిలపై గతంలో ప్రచురించిన అసభ్యకర పోస్టులను తొలగించినట్లు సమాచారం. అయితే పోస్టులు, వీడియోలు తొలగించినప్పటికీ నిందితులు మాత్రంఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు.
అడిషనల్ డీసీపీ రఘువీర్ నేతృత్వంలో…
మరోవైపు షర్మిలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసు దర్యాప్తు బృందానికి అడిషనల్ డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వం వహిస్తున్నారు. ఫిర్యాదు సందర్భంగా షర్మిల కొన్ని యూట్యూబ్ లింకుల్ని సైతం పొందుపరిచడంతో ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
ఆ లింకుల ఆధారంగా లాగిన్, ఐపీ అడ్రస్ వివరాలు తెలుసుకునేందుకు సాంకేతికంగా ప్రయత్నిస్తున్న విచారణ బృందం ఇందుకు సహకరించాలంటూ ఇప్పటికేయూట్యూబ్‌కు లేఖ కూడా రాసింది.
ఐపీ, లాగిన్ వివరాలే కీలకం…
యూట్యూబ్ నుంచి లాగిన్, ఐపీ వివరాలు వచ్చిన తర్వాత ఏ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఇంటర్‌నెట్ సేవలు అందుకున్నారో తెలుసుకోవడం సులభం అవుతుంది. ఆ తరువాత ఆ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడం ద్వారా నిందితులకు సంబంధించిన ఇతర ఆధారాలు సేకరిస్తారు. నిందితుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన వారి వివరాలు తెలియాలి.
సాధారణంగా ఏ సబ్‌స్క్రయిబర్ అయినా వీడియో అప్‌లోడ్ చేయడానికి కచ్చితంగా లాగిన్ కావాల్సిందే. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ నంబరుతోపాటు పలు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు వారు యూట్యూబ్‌ను వినియోగించే సమయంలో ఏదో ఒక ఐపీ (ఇంటర్‌నెట్ ప్రొటొకాల్) అడ్రస్ ఆధారంగా ఇంటర్‌నెట్‌తో అనుసంధానమవుతారు.
ఫీల్డ్ ఆపరేషన్‌కు మరో బృందం…
వైఎస్ షర్మిల కేసులో సాంకేతిక దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితుల్ని పట్టుకోవడానికి ఫీల్డ్ ఆపరేషన్ చేపట్టాలని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికోసం మరో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు.
2014లో ఏం జరిగిందంటే…
2014 ఎన్నికలప్పుడు కూడా షర్మిలపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేశారు. అప్పట్లో ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఠాణాలోనే కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు కూడా చేశారు. అయితే అప్పుడు సోషల్ మీడియా వేదికగా పరువునష్టం సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కొన్నాళ్లకు ఈ సెక్షన్‌ను సుప్రీం కోర్టు తొలగించడంతో ఆ కేసు మూతపడింది. అయితే తాజా ఫిర్యాదును.. అభ్యంతరకర, అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన సెక్షన్‌ల కింద నమోదు చేశారు. దీంతో విచారణ పూర్తయ్యేంత వరకు కేసు మూసివేసే ప్రసక్తే లేదని పోలీసులు చెప్తున్నారు.
బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు…
అప్పట్లో అరెస్టు అయిన ముగ్గురు నిందితులను కూడా ప్రస్తుత కేసులో అనుమానితుల జాబితాలో చేర్చారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వ్యవహారంతో సంబంధం ఉందా? అనే వివరాలను సాంకేతికంగా, క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు.
ఈ విషయమై సైబర్ క్రైమ్ విభాగం అడిషనల్ డీసీపీ కేసీఎస్ రఘువీర్ మాట్లాడుతూ.. షర్మిల ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక బృందం పనిచేస్తోందని చెప్పారు. యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్‌లోనూ అభ్యంతరకర, అసభ్య సందేశాలు పోస్టు చేశారని, నిందితుల్ని పట్టుకున్న తర్వాత ఈ వ్యవహారం వెనుక ఉన్న వారి వివరాలు ఆరా తీస్తామని, బాధ్యులు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.








