హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరుతున్నారు. పలువురు సెలబ్రిటీలు శుక్రవారం ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కూడా.
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌కు దీటుగా ప్రజాకూటమి ప్రచారం సాగడంతో తెలంగాణలో ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయనే అంచనాలున్నాయి.
శుక్రవారం ఇటు తెలంగాణతోపాటు అటు రాజస్థాన్‌లోనూ పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సందేశమిచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
‘ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాను..’ అంటూ మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవాళ ఎన్నికల రోజు! తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వెయ్యమని కోరుతున్నాను…. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయమని ప్రార్థిస్తున్నాను…
— Narendra Modi (@narendramodi) December 7, 2018