

భువనగిరి: అంగట్లో అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతకు ఈ ఘటన సరిగ్గా సరిపోతుంది. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామంలోని అందరినీ కోరిన ఆ అభ్యర్థి.. చివరికి తన ఓటునే తనకు వేసుకోవడం మర్చిపోయాడు. ఇంకేముంది.. ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాడు.
తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి పోటీపడ్డారు.
సోమవారం ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం వరకు ఆగంరెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు. తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే, ప్రచారంలో పడి తమ ఓట్లను వేసుకోవడం మర్చిపోయారు ఆ దంపతులు. అయితే, ఆ రెండు ఓట్ల వల్లే వారి ఓటమిపాలు కావాల్సి రావడం కొసమెరుపు.
ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతోనే విజయం సాధించడం గమనార్హం. ఆగంరెడ్డి దంపతులు తమ ఓట్లను వేసుకుని ఉంటే రెండు ఓట్లు పడేవి. ఫలితంగా ఒక్క ఓటు తేడాతో ఆయనే గెలిచి ఉండేవారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం వారి రాజకీయ జీవితాన్ని తారుమారు చేసింది. చేసేదేం లేక ఆ దంపతులిద్దరూ తలలు పట్టుకున్నారు. కాగా, ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత వార్తలు
ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు: భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు








