

హైదరాబాద్: కోటి కలలతో కట్టుకున్న వాడి వెంట దేశం దాటి వెళ్లిందామె. కానీ జీవితం తలకిందులైంది. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే అదనపు కట్న వేధింపులు మొదలయ్యాయి. ఆసరాగా నిలుస్తారనుకున్న అత్తమామలు కూడా కొడుకుకే వత్తాసు పలికారు. ఫలితం.. దేశం కాని దేశంలో నిత్యం శారీరకంగా, మానసికంగా నరకం చవిచూసిందామె!
అన్నిటికంటే ఘోరం ఏమిటంటే… వారం రోజుల్లో నేనొచ్చేస్తా.. అన్నీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుందాం అంటూ నమ్మబలికి భార్యను భారత్‌కు పంపించిన భర్త నెలలు గడుస్తున్నా భారత్ రాకపోగా, భార్య వీసా, పీఆర్‌ను రద్దు చేయించాడు. ఆపైన తన న్యాయవాదితో ఇండియాలో ఉన్న ఆమెకు విడాకుల నోటీసులు పంపించాడు. ఆ తరువాత ఏకపక్షంగా విడాకులు తీసుకుని వరుసకు మరదలైన మరో యువతిని పెళ్లి చేసేసుకున్నాడు.
ఇదీ ఆస్ట్రేలియాలో ఉంటోన్న ఓ ఎన్నారై బాగోతం. తన భర్త, అత్తమామలు తనను వేధించడమేకాకుండా మోసం చేశారంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమె అత్తమామలను, ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్న యువతిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇన్‌స్పెక్టర్ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం… కృష్ణా జిల్లా నూజివీడు మండలం, సీతారాంపురానికి చెందిన కె.వంశీకృష్ణ(32) ఆస్ట్రేలియన్ సిటిజన్. పదేళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. 2015 ఆగస్టు నెలలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన సిరిచందనను వివాహం చేసుకున్నాడు.
రూ. 30 లక్షలు, 40 సవర్ల బంగారం…
వివాహ సమయంలో సిరిచందన తల్లిదండ్రులు అల్లుడికి రూ.30 లక్షలు నగదు, 40 సవర్ల బంగారం కట్నం కింద ఇచ్చారు. పెళ్లి చేసుకున్న తరువాత 20 రోజులకు భార్యను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లాడు వంశీకృష్ణ. పెళ్లికి ముందు తనకు నెలకు రూ.4.5 లక్షల జీతం అని చెప్పి అత్తింటి వారిని, భార్యను నమ్మించాడు అతడు.
అక్కడికెళ్లాక అది అబద్ధమని తెలియడంతో సిరిచందన భర్తను నిలదీసింది. దీంతో మనస్పర్థలు మొదలయ్యాయి.. ఆ తరువాత అవి అదనపు కట్న వేధింపులుగా మారాయి.
కాపురంలో కలహాలు పెరగడంతో సిరిచందన విషయాన్ని తల్లిదండ్రులు, అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పెద్దల సమక్షంలో సమస్య పరిష్కరించుకుందామంటూ వంశీకృష్ణ భార్యను నమ్మించాడు. తాను వారం రోజుల్లో వస్తానంటూ భార్యను 2016 జనవరిలో భారత్‌కు పంపించాడు. ఆమె ఇక్కడికి వచ్చిన నాలుగు రోజులకే సిరిచందన వీసాను, పీఆర్‌ను రద్దు చేయించాడు. ఈ విషయమై ఆమె అత్తమామలను నిలదీసినా ఫలితం లేకపోయంది.
నెలలు గడుస్తున్నా వంశీకృష్ణ ఇక్కడికి రాకపోగా ఆస్ట్రేలియాలో తన న్యాయవాది చేత భార్యకు విడాకుల నోటీసులు పంపించాడు. సిరిచందన వంశీకృష్ణ కుటుంబసభ్యులకు తెలిపినా వారూ పట్టించుకోలేదు. వీసా రద్దు కావడంతో విడాకుల నోటీసుల మేరకు ఆస్ట్రేలియా న్యాయస్థానంలో ఆమె హాజరుకాలేక పోయింది. దీనిని తనకు అవకాశంగా మలుచుకున్న వంశీకృష్ణ ఆస్ట్రేలియన్ కోర్టులో ఏకపక్షంగా విడాకులను మంజూరు చేయించుకున్నాడు.
మరోవైపు ఎవరికీ తెలియకుండా అతడి తల్లిదండ్రులు సీతమహాలక్ష్మి, రామారావు ఆస్ట్రేలియా వెళ్లి ఆరు నెలల పాటు ఉండి వచ్చారు. సిరిచందనతో విడాకులు మంజూరయ్యాయన్న ధీమాతో వంశీకృష్ణ గత ఏడాది నవంబర్‌లో తనకు మరదలు వరుస అయ్యే రాధను ఇండోనేషియాలో పెళ్లి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఏకపక్షంగా ఇచ్చిన విడాకులు చెల్లవంటూ సిరిచందన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వంశీకృష్ణ తల్లిదండ్రులతోపాటు అతడి రెండో భార్య రాధను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.








